Uppal: ఉప్పల్ పరిధిలో రోడ్డు ప్రమాదం
Uppal: హోమియోపతి ఆసుపత్రి సమీపంలో కారును ఢీకొట్టిన టిప్పర్.. ఐదు బైక్‌లు ధ్వంసం.. తప్పిన పెను ప్రమాదం.
Uppal: ఉప్పల్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ఉప్పల్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతాపూర్ ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు, ఐదు మోటార్ సైకిళ్లు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామశంకర్ నగర్‌కు చెందిన కారా భానుమూర్తి తన కారులో ఉప్పల్ నుంచి రామాంతాపూర్ వైపు వెళ్తున్నారు.
ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి ఎదురుగా ఉన్న గుడ్ డే బార్ అండ్ రెస్టారెంట్ సమీపానికి చేరుకున్న సమయంలో ట్రాఫిక్ కారణంగా ఆయన కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ వాహనం కారును బలంగా ఢీకొట్టింది. టిప్పర్ ఢీకొన్న తీవ్ర ప్రభావంతో కారు అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లి రహదారి పక్కన దుకాణాల ముందు పార్క్ చేసి ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టిప్పర్‌ను బీరప్పగూడకు చెందిన ధిగేయోగు బాబు రాజ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు, టిప్పర్‌తో పాటు ఐదు మోటార్ సైకిళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.




