Hyderabad: ఉస్మానియా హాస్టళ్లను వెంటనే ఆధునీకరించాలి రామచందర్‌రావు!

Hyderabad: ఉస్మానియా వర్సిటీ హాస్టళ్లను వెంటనే ఆధునీకరించాలని బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్. ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి.

HARISH, TARNAKA
Published on: 21 Sept 2026 12:16 PM IST
Hyderabad
X

Hyderabad: ఉస్మానియా హాస్టళ్లను వెంటనే ఆధునీకరించాలి రామచందర్‌రావు!

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఆధునీకరించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఓయూలోని లా కాలేజీ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. ఇటీవల ఐసీఎస్ఎస్ఆర్‌ నుంచి ఫెలోషిప్‌లు పొందిన విద్యార్థులను అభినందించారు. హాస్టళ్లలో సరైన వసతులు లేక విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలిస్తున్నారని తెలిపారు. సీఎం ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులతో ముందుగా కొత్త హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని, పాత భవనాలను వినియోగించగలిగితే మరమ్మతులు చేయించాలని కోరారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నందున ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలి

హైదరాబాద్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని రామచందర్‌రావు కోరారు. హుస్సేన్‌సాగర్‌ను వినాయక్‌సాగర్‌గా పిలుస్తూ గతంలో ఇక్కడే నిమజ్జనాలు నిర్వహించేవారని గుర్తుచేశారు. ఈ ఏడాది సంజీవయ్య పార్కు సమీపంలోని బ్యాక్‌వాటర్స్‌లో నిమజ్జన ఏర్పాట్లు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. క్లే, కూరగాయల రంగులతో తయారు చేసిన భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం అనంతరం త్వరగా తొలగించే అవకాశం ఉందని, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి డిమాండ్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డా.రామకృష్ణ , డా.వీరబాబువీరబాబు, డా.బాల్ నాయక్, డా. రవి, మరియు ఏబీవీపీ నాయకులు డా.శ్రీహరి, కమల్ సురేష్,డా.జీవన్, సురేష్,పృద్వితేజ,అలివే రాజు,హరి ప్రసాద్,గంధం నరేందర్,దృహన్, గెల్లు శేఖర్, మోక్షిత్, ఈక్షిత్, మోహన్ బాబు, అజయ్, రాహుల్, వీరబాబు మరియు పీజీ మరియు రీసెర్చ్ కలర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA