Talakondapally: పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక: ఏఈఓ అనిత!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌లో వర్షాభావంతో ఎండిన పంట పొలాలను ఏఈఓ అనిత, సర్పంచ్ నిర్మల పరిశీలించారు. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Nov 2026 8:57 PM IST
Talakondapally
X

Talakondapally: పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక: ఏఈఓ అనిత!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మండల వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మండల వ్యవసాయ అధికారి ఏఈఓ అనిత గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్‌తో కలిసి గ్రామంలోని మొక్కజొన్న, వరి తదితర పంట పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈఓ అనిత మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని రాంపూర్‌తో పాటు వివిధ గ్రామాల్లో ఎండిపోయిన పంటల వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో పంట పొలాల పరిశీలన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ పంట పొలాల వద్ద అందుబాటులో ఉండి పంట నష్టానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులకు తెలియజేసి సహకరించాలని కోరారు. గ్రామాల్లో సర్పంచులు దండోరా వేయించి రైతులకు సమాచారం అందించాలని, పంట నష్టం అంచనా ప్రక్రియకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామంలో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన వరి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు వర్షాలు లేక ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్రంగా నష్టపరిచాయని తెలిపారు.

ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్, వ్యవసాయ శాఖ ఏఈఓ అనిత, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ మధు వెంకటరెడ్డి, సప్పిడి శివ, మాజీ వార్డు సభ్యులు చిలకం పకీర, నిమ్మల జంగయ్య, రొయ్యల కృష్ణయ్య, మీసాల జంగయ్య, చిలకం వెంకటేష్, కె. రమేష్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY