Kadthal: ముద్విన్ నరసింహ స్వామి ఆలయానికి రూ.2 లక్షల విరాళం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రేకుల షెడ్ నిర్మాణానికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 8:30 PM IST
Kadthal
X

Kadthal: ముద్విన్ నరసింహ స్వామి ఆలయానికి రూ.2 లక్షల విరాళం!

కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్ నిర్మాణం చేపట్టేందుకు ఈ విరాళాన్ని అందజేశారు.

ఆలయాన్ని సందర్శించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆలయ అభివృద్ధి పనుల గురించి వివరించారు. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులకు నీడ కల్పించేందుకు రేకుల షెడ్ నిర్మాణం అవసరమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన సుంకిరెడ్డి రూ.2 లక్షల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు ప్రజల విశ్వాసానికి, ఆధ్యాత్మిక జీవనానికి ప్రతీకలని అన్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రేకుల షెడ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోరిన వెంటనే స్పందించి రూ.2 లక్షలు అందించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సహకారం ఆలయానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా పర్వదినాలు, ప్రత్యేక పూజల సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్తులు సైతం ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంధ్య వెంకటేష్, వార్డు సభ్యులు ఈర్లపల్లి మల్లేష్, రాశిక శ్రీను, మంకాల శ్రీను, సంధూరి కృష్ణ, సీనియర్ నాయకులు కావటి జంగయ్య యాదవ్, జంగం శ్రీను, పొగాకు వినోద్, నక్కపోతు మధు, ఏదుల వెంకటేష్, సురేష్, సైదులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY