Uppal: రియల్టర్ల 'చలో ఉప్పల్ భగాయత్'.. సీఎం రేవంత్ పర్యటనలో టెన్షన్!

Uppal: ఉప్పల్ భగాయత్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ 22A భూముల సమస్యపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ 'చలో ఉప్పల్ భగాయత్' పిలుపునిచ్చింది.

KARUNAKAR, UPPAL
Published on: 7 Jun 2026 8:28 AM IST
Uppal
X

Uppal: రియల్టర్ల 'చలో ఉప్పల్ భగాయత్'.. సీఎం రేవంత్ పర్యటనలో టెన్షన్!

ఉప్పల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉప్పల్ భగాయత్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్న నేపథ్యంలో, 22ఏ సమస్యపై తమ ఆవేదనను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగింది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న 22ఏ జాబితా అంశంపై గళమెత్తేందుకు రియల్టర్లు భారీగా సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో అన్ని విధాలా చట్టబద్ధంగా ఉన్న ప్లాట్లు, ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా స్తంభించిపోయాయని సంఘం ఆరోపించింది.

దీంతో వేలాది మంది కొనుగోలుదారులు, అమ్మకందారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. గత 20 రోజులుగా వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో భూముల క్రయవిక్రయాలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను పలుమార్లు కలిసి వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందని రియల్టర్లు వాపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ పర్యటననే వేదికగా మార్చుకుని తమ గోడును ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో నేడు సాయంత్రం 5 గంటలకు "హలో రియల్టర్ – చలో ఉప్పల్ భగాయత్" పేరుతో నిర్వహించే కార్యక్రమానికి పోచారం, కొర్రెముల, నారపల్లి, కాచివాని సింగారం, చెంగిచెర్ల, సాలార్‌జంగ్ కంచ, పర్వతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్, రామంతాపూర్ తదితర ప్రాంతాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. 22ఏ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, చట్టబద్ధ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని రియల్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story