LB Nagar: ఎల్బీనగర్‌లో బుడ్డ సత్యనారాయణపై రెక్కీ కలకలం!

LB Nagar: హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణపై రెక్కీ నిర్వహించిన నలుగురు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 25 Aug 2026 4:33 PM IST
LB Nagar:
X

LB Nagar: ఎల్బీనగర్‌లో బుడ్డ సత్యనారాయణపై రెక్కీ కలకలం!

LB Nagar: హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బుడ్డ సత్యనారాయణపై రెక్కీ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఎల్బీనగర్‌లో కలకలం రేపుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా కొందరు అనుమానాస్పద వ్యక్తులు తన కదలికలను గమనిస్తున్నారని సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మన్సూరాబాద్‌ చెరువు కట్ట, సరస్వతీనగర్‌ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నజీర్‌ బైక్‌ షాప్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉండగా.. చెరువు కట్టపై మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారంతా తననే గమనిస్తున్నట్లు అనిపించిందని సత్యనారాయణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

గతంలోనూ తనపై బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు సత్యనారాయణ ఆరోపించినట్లు తెలుస్తోంది. తనకు ఏదైనా హాని జరిగితే సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరోవైపు.. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్రెడ్డి రామిరెడ్డి స్పందించారు. రెక్కీకి పాల్పడుతున్నారనే అనుమానంతో నలుగురు యువకులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించామని తెలిపారు.

ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలేది లేదని మల్రెడ్డి రామిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌ అభివృద్ధి కోసం పోరాడితే అర్థముంటుందని.. సొంత పార్టీలోనే పంచాయతీలు పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఎల్బీనగర్‌ సీఐ, ఏసీపీకి విషయం వివరించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎంతటి వ్యక్తుల ప్రమేయం ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. పోలీసులు స్పందించకపోతే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

నలుగురు యువకులను ఎవరు పంపించారు..? వారి వెనుక ఎవరు ఉన్నారు..? అసలు బుడ్డ సత్యనారాయణపై నిజంగానే రెక్కీ జరిగిందా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. సీసీటీవీ ఫుటేజీ, అనుమానితుల కదలికలు, ఫోన్‌ కాల్స్‌ తదితర అంశాలను పరిశీలిస్తే ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.రెక్కీ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండటంతో.. ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందన్నది ఎల్బీనగర్‌లో ఆసక్తికరంగా మారింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story