Uppal: నిధుల వరద.. కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి!

Uppal: ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టిందని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. రామంతపూర్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు.

KARUNAKAR, UPPAL
Published on: 1 July 2026 1:20 PM IST
Uppal
X

Uppal: నిధుల వరద.. కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి!

ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ, ట్రాకింగ్ ట్రాక్, మౌలిక వసతుల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మందముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

హైదరాబాద్ నగరంలోని చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు తాగునీటి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ నల్లచెరువు, నాచారం హెచ్‌ఎంటీ చెరువు, కాప్రా చెరువు, రామంతపూర్ పెద్ద చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మొదటి దశలో రూ.104 కోట్ల నిధులు కేటాయించి, హైడ్రా ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్‌లు, సుందరీకరణతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.

ఇందులో ఉప్పల్ నల్లచెరువుకు రూ.20 కోట్లు, నాచారం హెచ్‌ఎంటీ చెరువుకు రూ.30 కోట్లు, కాప్రా చెరువుకు రూ.35 కోట్లు, రామంతపూర్ పెద్ద చెరువుకు రూ.19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండో దశలో రామంతపూర్ చిన్న చెరువు, చర్లపల్లి చెరువు, నాచారం ఎర్రకుంట అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచే ఉప్పల్ ప్రాంత సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు.

ప్రస్తుతం సీఎం హోదాలో ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,000 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో వర్షాకాలంలో రామంతపూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు తీవ్రంగా జలమయం అయ్యేవని, పడవలు నడిపే పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు.

ఆ సమస్యను ఎంపీగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి గుర్తించి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రామంతపూర్ పెద్ద చెరువు వరకు ఎస్‌ఎన్‌డీపీ పనులకు రూ.16 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారని తెలిపారు.

ఉప్పల్ భగాయత్ సమస్య పరిష్కారానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోయినా ప్రస్తుతం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

అలాగే ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాల కోసం ప్రజలు విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి రూ.40 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు.

ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వేగవంతం చేసిన ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఉప్పల్ ప్రాంతంపై ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అభివృద్ధి పనులకు కేటాయిస్తున్న నిధుల ద్వారానే స్పష్టమవుతోందన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రైనేజీ, రోడ్లు, కల్వర్టులు వంటి మౌలిక వసతులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వర్టులు, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు ఇబ్బందులు తగ్గించామని తెలిపారు.

పార్టీలకతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, బీజేపీ, బీఆర్ఎస్ సహా ఏ పార్టీ ప్రజాప్రతినిధులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్వయంగా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కోరిన వెంటనే నిధులు కేటాయిస్తున్నారని బహిరంగంగా చెప్పడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు.

పదేళ్ల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అభివృద్ధి పనులు జరిగాయని, ఆ తర్వాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలనలోనే ఉప్పల్ నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ కంది ఆగిరెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంది శ్రవణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బొప్పనపల్లి సుధాకర్ రెడ్డి, హబ్సీగూడ డివిజన్ అధ్యక్షుడు గన్నారం విజయ్ కుమార్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గణేష్ నాయక్, జనరల్ సెక్రటరీ ధర్మా నాయక్, మురళీకృష్ణ ముదిరాజ్, చింతల బాబురావు, గుండు రాజన్న, మాలు నాయక్, రాజు నాయక్, వాసు నాయక్, సాయి కుమార్, సాయి కిరణ్, శివ, నర్సింగ్ రావు, రవి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story