Uppal: కక్ష సాధింపు రాజకీయాలు తగదు: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Uppal: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కక్ష సాధింపు రాజకీయాలు సరైనవి కాదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Uppal
Uppal: కాప్రా (ఉప్పల్ నియోజకవర్గం)లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.
హైకోర్టు తీర్పుతో నిజం వెలుగులోకి వచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తి చేసినట్లు చెప్పిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
“కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్” ప్రకారం సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను నమోదు చేయకుండా నివేదిక రూపొందించారని ఆయన ఆరోపించారు. నివేదిక పూర్తికాకముందే అసెంబ్లీలో చర్చించడం, మీడియాకు లీక్ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని, ఇది ఏకపక్షంగా జరిగిన ప్రక్రియ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులను బద్నాం చేయాలనే ప్రయత్నం విఫలమైందని అన్నారు.
విచారణకు తాము వ్యతిరేకం కాదని, కానీ అది పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. కమిషన్‌ల పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




