Champapet: చంపాపేట్ సైనిక్ స్కూల్లో దుర్గామాత మాల కలకలం!
Champapet: సైనిక్ స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. దుర్గామాత మాల ధరించారనే కారణంతో 10వ తరగతి విద్యార్థులను స్పెషల్ క్లాసులకు అనుమతించకపోవడంపై వివాదం.
Champapet: చంపాపేట్ సైనిక్ స్కూల్లో దుర్గామాత మాల కలకలం!
Champapet: చంపాపేట్ మారుతి నగర్ లో ఉన్న సైనిక్ స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గామాత మాల వేసుకున్నారనే కారణంతో పదవ తరగతి విద్యార్థులను స్పెషల్ క్లాసులకు అనుమతించకుండా యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పలువురు పదవ తరగతి విద్యార్థులు దుర్గామాత మాల ధరించారు. నిత్యం జరిగే స్పెషల్ క్లాసులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థులను మాల తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని, లేకుంటే బయటే ఉండాలని యాజమాన్యం తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు తరగతులకు దూరమయ్యారు.
10వ తరగతి అత్యంత కీలకమైన సమయంలో ఇలా స్పెషల్ క్లాసులకు దూరం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడుతున్నారు.
ఒకవైపు ప్రభుత్వం విద్యార్థుల్లో భక్తి భావాన్ని, సంస్కృతిని పెంపొందించాలని చెబుతుంటే... మరోవైపు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇలా వ్యవహరించడం దారుణమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సైనిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులందరినీ ఎటువంటి షరతులు లేకుండా స్పెషల్ క్లాసులకు అనుమతించేలా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.




