Chaitanyapuri: చైతన్యపురి 72 అడుగుల గణేష్ మండపం వద్ద డ్రగ్స్ వ్యతిరేక సదస్సు
Chaitanyapuri: గణేష్ సురక్ష సంకల్ప్-2026లో భాగంగా చైతన్యపురి 72 అడుగుల గణపతి మండపం వద్ద పోలీసులు “Say No to Drugs” అవగాహన సదస్సు నిర్వహించారు.
Chaitanyapuri: చైతన్యపురి 72 అడుగుల గణేష్ మండపం వద్ద డ్రగ్స్ వ్యతిరేక సదస్సు
చైతన్యపురి: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా ప్రజల్లో భద్రత, సామాజిక బాధ్యతతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పెంపొందించే లక్ష్యంతో చైతన్యపురి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ సీపీ బి. సుమతి ఆదేశాల మేరకు చైతన్యపురిలోని 72 అడుగుల పర్యావరణహిత గణేష్ మండపం వద్ద “Say No to Drugs” అంశంపై చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ కే. సైదులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యం, మానసిక స్థితి, కుటుంబ జీవితం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
“డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి యెస్ చెప్పండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
గణేష్ సురక్ష సంకల్ప్–2026 కేవలం గణేష్ ఉత్సవాల సమయంలో భద్రత కల్పించడానికే పరిమితం కాదని, ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం, యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం సమగ్ర కార్యక్రమంగా కొనసాగుతోందని సీఐ సైదులు పేర్కొన్నారు.
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా, బాధ్యతాయుతంగా నిర్వహించడంతో పాటు డ్రగ్స్ వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంలో పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ రెడ్డి, కమిషనరేట్ నుంచి ఎంపికైన సహచరులు, చైతన్యపురి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




