Hyderabad: ఒంటరి ప్రయాణాలకు స్వస్తి పలకండి: సైబరాబాద్ సీపీ ఎం. రమేష్ పిలుపు!
Hyderabad: నవంబర్ 26-28న టీ-హబ్‌లో జరిగే ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ వేళ వాహనదారులు ఒంటరి ప్రయాణాలకు స్వస్తి పలికి కార్‌పూలింగ్ వాడాలని సీపీ డాక్టర్ ఎం. రమేష్ కోరారు.
Hyderabad: ఒంటరి ప్రయాణాలకు స్వస్తి పలకండి: సైబరాబాద్ సీపీ ఎం. రమేష్ పిలుపు!
Hyderabad: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వాహనదారులు ఒంటరి ప్రయాణాలకు స్వస్తి పలికి, వాహనాలను పంచుకునే (కార్‌పూలింగ్) విధానాన్ని మరియు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ఛైర్మన్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న మూడు రోజుల పట్టణ రవాణా కార్యక్రమం ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ వివరాలను ఆయన మంగళవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
హాయ్ బోలో, దిల్ ఖోలో, నో సోలో, సాథ్ చలో!అనే నినాదంతో, సైబరాబాద్ పరిధిలో నివసించేవారు, ఉద్యోగులు, ప్రయాణికులంతా ‘మేము సైతం’ అంటూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో ప్రతి పౌరుడి బాధ్యత కీలకమని పేర్కొన్న సీపీ, ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు:
ద్విచక్ర వాహనదారులు మరొకరిని తోడుగా తీసుకురావాలని, ఐదు సీట్ల కారులో ఒక్కరే కాకుండా కనీసం మరొకరితో కలిసి ప్రయాణించాలని సూచించారు. పిల్లలను పాఠశాలలకు దింపేందుకు కార్లలో పలుమార్లు తిరిగే తల్లిదండ్రులు తమ ప్రయాణ విధానంపై పునరాలోచించాలని కోరారు. సైకిళ్లపై వచ్చేవారికి ప్రత్యేక మార్గం, భద్రతతో పాటు కోరిన సమయంలో ఆటంకం లేని రాకపోకలకు వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.సీసీటీవీ కెమెరాలు, వాహన గణన యంత్రాల సాయంతో గతంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని ఈ మూడు రోజులతో పోల్చి, రద్దీ లేని రహదారుల ఫలితాలను ప్రత్యక్షంగా ప్రజల ముందుంచుతామని తెలిపారు.
జేఎన్టీయూ నుంచి ఐకియా ఐటీ కారిడార్ వైపు వచ్చేవారిలో 65 శాతం మంది ఒకే సమయంలో గంట, గంటన్నర వ్యవధిలో చేరుకుంటుండటం వల్లే ప్రధాన రహదారులు స్తంభిస్తున్నాయని సీపీ వివరించారు. ఈ రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ సహకారంతో అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పారు. గత నెల రోజులుగా నివాసితుల సంక్షేమ సంఘాలు (RWAs), ఆసుపత్రులు, ఐటీ సంస్థలతో చర్చలు జరిపామని, ఇందులో భాగంగా ఫీనిక్స్, ఇన్ఫోసిస్ సంస్థలు తమ ఉద్యోగుల్లో కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చాయని అభినందించారు. ఈ ఉద్యమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), ఆర్టీసీ, మెట్రో (HMRL), హెచ్ఎండీఏ (HMDA) కీలక భాగస్వాములుగా ఉన్నాయన్నారు.
కేవలం సూచనలకే పరిమితం కాకుండా ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీ సిహెచ్. శ్రీనివాస్ అన్నారు. సీపీ చొరవతో చేపట్టిన ‘ట్రాఫిక్ టాక్స్’ ద్వారా సమాజ స్థాయిలో మార్పు వస్తుందని, ఈ మూడు రోజులు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కూకట్పల్లి డీసీపీ శ్రీ రితిరాజ్ కోరారు. టీ-హబ్‌లో నిర్వహించే వర్క్‌షాపులు, సదస్సుల ద్వారా ప్రజల నుంచి వినూత్న ఆలోచనలను స్వీకరిస్తామని ట్రాఫిక్-I డీసీపీ డా. ఎస్. రవికుమార్ తెలిపారు.
ట్రాఫిక్‌ను సృష్టించేది మనమే; దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా మనదే”అని ట్రాఫిక్-I అదనపు డీసీపీ హనుమంత రావు స్పష్టం చేశారు.
కేవలం టీ-హబ్ ప్రదర్శనను తిలకించడమే కాకుండా, రద్దీ లేని సైబరాబాద్‌ను స్వయంగా అనుభవించి పదిమందికి ఆదర్శంగా నిలవాలని సీపీ డా. ఎం. రమేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ సీఈఓ నవీద్ ఆలం ఖాన్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




