Medipalli: బ్యాంక్ లోన్ కోసం తప్పుడు పత్రాలు.. నర్సింగ్ ఆఫీసర్‌పై కేసు నమోదు

Medipalli: నకిలీ శాలరీ స్లిప్పులు, తప్పుడు గుర్తింపు పత్రాలు సమర్పించి మేడిపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్ నుండి రూ.10 లక్షల పర్సనల్ లోన్ పొంది మోసానికి పాల్పడిన ఓ నర్సింగ్ అధికారిణిపై మేడిపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 5 July 2026 8:18 AM IST
Medipalli
X

Medipalli: బ్యాంక్ లోన్ కోసం తప్పుడు పత్రాలు.. నర్సింగ్ ఆఫీసర్‌పై కేసు నమోదు

మేడిపల్లి: నకిలీ జీత స్లిప్పులు, తప్పుడు పత్రాలు సమర్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి రూ.10 లక్షల వ్యక్తిగత రుణం పొందిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అంతర్గత విచారణలో మోసం బయటపడటంతో మేడిపల్లి పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు నర్సింగ్ అధికారిణిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, సనత్‌నగర్‌లో సీనియర్ నర్సింగ్ అధికారిణిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ ప్రతిభ అనే మహిళ 2023 ఏప్రిల్‌లో ఎస్‌బీఐ పర్వతాపూర్ శాఖలో ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ స్కీమ్ కింద రూ.10 లక్షల వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసింది. ఈ సందర్భంగా ఆధార్, పాన్ కార్డు, నాలుగు నెలల జీత స్లిప్పులు సమర్పించగా, వాటిని పరిశీలించిన బ్యాంకు 2023 ఏప్రిల్ 21న 72 నెలల కాలపరిమితికి రుణాన్ని మంజూరు చేసింది.

అయితే కొంతకాలం తర్వాత రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఖాతా 2025 ఏప్రిల్ 21న ఎన్‌పీఏ (నాన్-పర్ఫార్మింగ్ అసెట్)గా మారింది. అనంతరం బ్యాంకు చేపట్టిన విచారణలో సమర్పించిన జీత స్లిప్పులు నకిలీవని, పాన్ కార్డు వివరాల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. రుణం పొందేందుకు తప్పుడు గుర్తింపు వివరాలు, నకిలీ పత్రాలను వినియోగించినట్లు గుర్తించిన బ్యాంకు 2025 సెప్టెంబర్ 23న ఆ రుణ ఖాతాను 'ఫ్రాడ్ అకౌంట్'గా ప్రకటించింది.

ఈ మోసం కారణంగా బ్యాంకుకు రూ.8,97,815 నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో రూ.7,95,603 అసలు బకాయి, రూ.1,02,212 వడ్డీ ఉన్నట్లు వెల్లడించారు. ఎస్‌బీఐ పర్వతాపూర్ శాఖ మేనేజర్ సూరిశెట్టి హరిహర ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story