అంగ‌రంగ వైభ‌వంగా ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు, రాజ‌కీయ నాయ‌కుల సంద‌డి!

Bonalu: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

Mokshith
Published on: 2 Aug 2026 12:59 PM IST
Bonalu
X

అంగ‌రంగ వైభ‌వంగా ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు, రాజ‌కీయ నాయ‌కుల సంద‌డి

Bonalu: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జాతర సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు

బోనాల జాతర సందర్భంగా ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పొగాకు బజార్, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ వంటి ప్రధాన రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బాలా, ఘాస్‌మండి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యేక మార్గాలను ప్రకటించారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచారు.

భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్.. పటిష్ట భద్రత

భక్తుల సౌకర్యార్థం మొత్తం 14 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, జింఖానా గ్రౌండ్ వంటి ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. వీఐపీ వాహనాల కోసం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం సమీపంలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. జాతర భద్రత కోసం మూడు అంచెల పోలీసు భద్రత కల్పించారు. మొత్తం 2,500 మంది పోలీసు సిబ్బంది, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ విధుల్లో ఉన్నారు. ఆలయం పరిసర ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తిగా తనిఖీ చేశాయి. ప్రతి క్యూ లైన్‌తో పాటు ఆలయం చుట్టూ సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సబ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ సందర్భంగా నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డీసీపీ రక్షిత ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే గోల్కొండ బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లే, ఉజ్జయిని మహంకాళి జాతరను కూడా విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు.

రాజకీయ ప్రముఖుల సందడి.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

జాతరలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడకముందు బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదని, తమ ప్రభుత్వ హయాంలోనే బోనాలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించామని గుర్తుచేశారు. ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భారీ వ్యయంతో అభివృద్ధి చేశామని చెప్పారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఉజ్జయిని మహంకాళి జాతరకు దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story