Vikarabad: వికారాబాద్ విజయవంతమైన ఎస్ఎఫ్ఐ విద్యాసంస్థల బంద్
Vikarabad: విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం వికారాబాద్ జిల్లాలో SFI బంద్. విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ.
Vikarabad: వికారాబాద్ విజయవంతమైన ఎస్ఎఫ్ఐ విద్యాసంస్థల బంద్
వికారాబాద్: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) మరియు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు సరైన మౌలిక వసతులు లేక శిథిల స్థితిలో కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే అన్ని విద్యాసంస్థలకు పక్కా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫార్మ్స్ మరియు పాఠ్యపుస్తకాలు సమకూర్చాల్సిన అవసరం ఉందని, మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు పెంచి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్, MEO, DEO మరియు లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు కఠినమైన ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అనధికారంగా నిర్వహిస్తున్న పుస్తకాలు, యూనిఫార్మ్స్, నోట్బుక్స్ విక్రయ కేంద్రాలను మూసివేయాలని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి జి.ఓ నెంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఆధునిక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి బస్ పాసులు ఇవ్వాలని, మెస్ మరియు కాస్మోటిక్ ఛార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అన్నారు. అలాగే ప్రతి విద్యాసంస్థలో కరెంట్, త్రాగునీరు, ఇంటర్నెట్, వంటషెడ్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని, NEP 2020 ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్న రూ.250 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో అనేకమైన ఉద్యమ కార్యక్రమాలకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా పిలుపునిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ , నాయకులు దీపక్,సింజిన్, అనిల్, పాండు, రెహాన్, ఫైజల్, శివ, చింటూ, మున్నా , షాహేద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఎస్ఎఫ్ఐ నేతలు స్పష్టం చేశారు.




