Vikarabad: స్కూల్ ముసుగులో పుస్తకాల వ్యాపారం.. వికారాబాద్ కృష్ణవేణి స్కూల్‌పై SFI ధ్వజం!
Vikarabad: వికారాబాద్ కృష్ణవేణి పాఠశాల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పుస్తకాల వ్యాపారం చేస్తోందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.
Vikarabad: స్కూల్ ముసుగులో పుస్తకాల వ్యాపారం.. వికారాబాద్ కృష్ణవేణి స్కూల్‌పై SFI ధ్వజం!
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రైవేటు విద్యాసంస్థ అయిన కృష్ణవేణి పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలని, ఆ సంస్థ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
కృష్ణవేణి పాఠశాల యాజమాన్యం ఒక ప్రైవేట్ గదిని అద్దెకు తీసుకుని, తమ ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతున్న స్థావరం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆ పుస్తకాలను మండల విద్యాశాఖాధికారి (MEO) వచ్చి అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను సీజ్ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ..
వికారాబాద్ పట్టణంలో కృష్ణవేణి పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ పుస్తకాల వ్యాపారానికి తెరలేపిందని మండిపడ్డారు. ఒక్క నర్సరీ తరగతి విద్యార్థి నుంచి పుస్తకాల కోసమే రూ. 2070 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పాఠశాల కూడా క్యాంపస్‌లో గానీ, బయట ప్రైవేట్ గదుల్లో గానీ పుస్తకాలు, దుస్తులు అమ్మకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం సిలబస్ పుస్తకాల జాబితాను మాత్రమే నోటీస్ బోర్డుపై పెట్టాలని, కానీ కృష్ణవేణి యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులను, విద్యాశాఖ జీవోలను పూర్తిగా బేఖాతరు చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎస్సీఈఆర్‌టీ (SCERT) పుస్తకాలను పక్కనబెట్టి, భారీగా కమిషన్లు ఇచ్చే ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు.
ఈ అక్రమ దందా వెనుక విద్యాశాఖ అధికారుల మామూళ్ల సిత్రం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, .మండల విద్యాశాఖాధికారులు (MEO) నిరంతరం కార్పొరేట్ విద్యాసంస్థలపై పర్యవేక్షణ చేయాలని కోరారు.
తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ పుస్తకాల వ్యాపారానికి పాల్పడుతున్న కృష్ణవేణి పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి అనిల్, నాయకులు దీపక్, జిల్లా కమిటీ సభ్యులు అనిల్, రాజశేకర్, సంజు, తదితరులు పాల్గొన్నారు.




