Hyderabad: రోజుకి 12.1 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపే లక్ష్యం!
Hyderabad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ (OB) తొలగింపు లక్ష్యాలపై సీఎండీ సమీక్ష.
Hyderabad: రోజుకి 12.1 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపే లక్ష్యం!
Hyderabad: రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గును అందించాల్సి ఉన్నందున దీని కోసం సవరించిన ఓవర్ బర్డెన్ లక్ష్యాలను రోజువారీగా సాధించాలని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. శనివారం ఆయన సింగరేణి వ్యాప్తంగా 15 ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తవ్వి తీసే పనులు నిర్వహిస్తున్న 19 ఆఫ్ లోడింగ్ సంస్థల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, దీనికి అనుగుణంగా సింగరేణి సంస్థ తన వంతుగా తగినంత బొగ్గును థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు అమలు జరుపుతోందని, దీనికి అనుగుణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో సవరించిన ఓబీ తొలగింపు లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు నెల వరకు 1,205 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించే లక్ష్యాన్ని నిర్దేశించగా 101 శాతంతో 1,221 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించడం జరిగిందన్నారు. అయితే మొత్తం 19 ఆఫ్ లోడింగ్ సంస్థలలో ఆగస్టు నెలాఖరు వరకు 8 ఆఫ్ లోడింగ్ సంస్థల వారు మాత్రమే 100 శాతం ఓవర్ బర్డెన్ లక్ష్యాలు సాధించారని, మిగిలిన వారు లక్ష్యాలు సాధిస్తూ సహకరించాలన్నారు. కాగా సెప్టెంబర్ నెలలో నిర్దేశిత రోజువారీ ఓబీ తొలగింపు లక్ష్యం 7.28 లక్షల క్యూబిక్ మీటర్లుగా భావించినప్పటికీ పెరుగుతున్న బొగ్గు డిమాండ్ కు అనుగుణంగా రోజువారీ లక్ష్యాన్ని 12.1 లక్షల క్యూబిక్ మీటర్లుగా నిర్ణయించామని దీనికి అనుగుణంగా లక్ష్యాలు సాధించాలని కోరారు.
ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలు ఖచ్చితంగా సాధించాలని ఆదేశించారు. జె.వి.ఆర్ ఓ.సి, మణుగూరు ఓ.సి, జి.డి.కె ఓ.సి, ఆర్.జి ఓ.సి-3, ఆర్.జి ఓ.సి-2, కె.టి.కె ఓ.సి-2, శ్రీరాంపూర్ ఓ.సీలలో ఓబీ తొలగిస్తున్న కొన్ని ఆఫ్ లోడింగ్ సంస్థల వారు లక్ష్యాల సాధనలో కొంత వెనుకబడి ఉన్నారనీ, వెనుకబడిన లక్ష్యాల సాధనతో పాటు తాజాగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రతీ ఆఫ్ లోడింగ్ సంస్థ ఎన్ని షవల్స్, ఎన్ని డంపర్లు వాడుతున్నాయి? లక్ష్యాల సాధనకు ఎన్ని వాడాల్సి ఉంది.? అనే విషయాన్ని కూడా లోతుగా సమీక్షించారు, ఇంకా కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన ఓబీ తొలగింపు ఆఫ్ లోడింగ్ టెండర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సంస్థ సీఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎల్.వి. సూర్య నారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) శ్రీ ఎం. తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్) శ్రీ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్) శ్రీ టి. శ్రీనివాస్ మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పోరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.




