Singareni: సింగరేణి బొగ్గు రవాణాలో 4 శాతం వృద్ధి తొలి అర్ధ భాగం ఫలితాలు!

Singareni: సింగరేణి తొలి అర్ధ సంవత్సరంలో 299.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా. తెలంగాణ థర్మల్ ప్లాంట్లకు 24.58% అధికంగా బొగ్గు సరఫరా చేసినట్లు సిఎంఓ వెల్లడి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Oct 2026 7:06 PM IST
Singareni
X

Singareni: సింగరేణి బొగ్గు రవాణాలో 4 శాతం వృద్ధి తొలి అర్ధ భాగం ఫలితాలు!

Singareni: తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి కాలరీస్ బొగ్గు రవాణాలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల కాలంలో 299.4 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రవాణా చేసిన 287.6 లక్షల టన్నులతో పోలిస్తే 4 శాతం వృద్ధి సాధించింది.

రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ సింగరేణి ఈసారి తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీగా బొగ్గును సరఫరా చేసింది. గత ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 159.1 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా ఈ ఏడాది 198.2 లక్షల టన్నులు సరఫరా చేసింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 24.58 శాతం అధికంగా బొగ్గు రవాణా చేసినట్లు సంస్థ వెల్లడించింది.

థర్మల్ ప్లాంట్లకు పెరిగిన సరఫరా

థర్మల్ విద్యుత్ కేంద్రాల వారీగా చూస్తే.. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌కు 39.8 లక్షల టన్నులు సరఫరా చేయగా, గత ఏడాది 26.4 లక్షల టన్నులతో పోలిస్తే 50.76 శాతం వృద్ధి నమోదైంది.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు 33.9 లక్షల టన్నులు సరఫరా చేసింది. గత ఏడాది 21.5 లక్షల టన్నులతో పోలిస్తే 57.67 శాతం వృద్ధి సాధించింది.

మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు 24.4 లక్షల టన్నులు సరఫరా చేసి, గత ఏడాది కంటే 25.13 శాతం వృద్ధి నమోదు చేసింది.

అలాగే సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్‌కు 26.6 లక్షల టన్నులు సరఫరా చేయగా, 27.27 శాతం వృద్ధి నమోదైంది.

ఎన్‌టీపీసీ తెలంగాణ ప్లాంట్‌కు ఈ ఏడాది 25.3 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా.. గత ఏడాది ఇదే కాలంలో 19.4 లక్షల టన్నులు సరఫరా చేసింది. అయితే ఎన్‌టీపీసీ రామగుండం ప్లాంట్‌కు గత ఏడాది 43.5 లక్షల టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 42.7 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసింది.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో.. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సకాలంలో అందించేందుకు సింగరేణి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు ఉత్పత్తి, రవాణాను పెంచేందుకు చర్యలు చేపట్టింది.

సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ప్రతిరోజూ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్షిస్తూ ఉత్పత్తితో పాటు బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా సజావుగా జరిగేలా ఐదుగురు ఉన్నతాధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడం సింగరేణి నైతిక బాధ్యతగా భావిస్తూ.. స్వరాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అధిక ప్రాధాన్యతతో బొగ్గు సరఫరా చేస్తోందని సంస్థ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 620 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 650 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.