Tandur: తాండూరు ఎంసీహెచ్‌లో ఆరేళ్ల చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన!
Tandur: తాండూరు ఎంసీహెచ్‌లో మరో విషాదం ఆరేళ్ల చిన్నారి శ్రీఆద్య మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు వరుస మరణాలపై విచారణకు డిమాండ్.
Tandur: తాండూరు ఎంసీహెచ్‌లో ఆరేళ్ల చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన!
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వరుస విషాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తల్లీబిడ్డ మృతి ఘటన మరవకముందే.. తాజాగా ఆరేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది.
పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు కుమార్తె శ్రీ ఆద్య అనారోగ్యంతో తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రి కి తీసుకువచ్చిన చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
తమ చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందలేదని.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఇదే ఆసుపత్రిలో ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి.తాజాగా మరో ఆరేళ్ల చిన్నారి మృతి చెందడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.తాండూరు జిల్లా ఆసుపత్రి నుంచి కొడంగల్ మెడికల్ కాలేజీకి వైద్య సేవల వ్యవస్థ మారిన తర్వాత తమ సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
బాధితుల ఆవేదన:
“వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే.. పరిస్థితి విషమిస్తే పట్టణానికి వెళ్లాలని సలహా ఇస్తున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రే ఆధారం. ఇక్కడే సరైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
వరుస మరణాలపై సమగ్ర విచారణ చేపట్టి.. అసలు కారణాలను వెల్లడించాలని, వైద్య సేవల్లో లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యం.. భయాందోళనలకు కారణం కాకుండా, మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా మారాలని ప్రజలు కోరుతున్నారు.




