Pargi: పరిగిలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి మాఫియా దందా!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో మట్టి మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని, రాత్రివేళల్లో టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Pargi: పరిగిలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి మాఫియా దందా!
Pargi: పగలు ప్రశాంతంగా కనిపించే పరిగి రోడ్లు సూర్యుడు అస్తమిస్తే చాలు టిప్పర్ల రాకపోకలతో హడలెత్తుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి అయితే చాలు నిబంధనలు పక్కన పెట్టి మట్టి తరలింపు జోరుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పరిగి చుట్టుపక్కల ఉన్న గుట్టలను యథేచ్ఛగా తవ్వుతూ...ప్రకృతి సంపదను కొల్లగొడుతూ మట్టి దందా సాగిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గుట్టలు కనుమరుగవుతున్నా.రోడ్లపై టిప్పర్లు వరుసగా తిరుగుతున్నా అధికారుల నిఘా ఎక్కడ..?
తనిఖీలు ఎక్కడ..? చర్యలు ఎక్కడ..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మట్టి అక్రమ రవాణాకు సంబంధించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నామమాత్రపు తనిఖీలతోనే సరిపెడుతున్నారే తప్ప, పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇక మరింత తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పోలీస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇస్తూ మట్టి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.కానీ ప్రశ్న ఒక్కటే...కళ్ల ముందే టిప్పర్లు తిరుగుతున్నా. గుట్టలు తవ్వుతున్నా మట్టి తరలిస్తున్నా అధికారుల కళ్లకు ఇవి కనిపించడం లేదా..? లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారా.
పరిగి రోడ్లపైకి టిప్పర్లు దూసుకొస్తున్నాయంటున్న స్థానికులు.వీటి వేగం, ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాల ముప్పు కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులదే. అయితే పరిగిలో జరుగుతున్న ఈ మట్టి తరలింపుపై అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారా?
గుట్టలను తవ్వుతున్న వారిపై అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా? లేక పరిగిలో మట్టి మాఫియా దందా ఇలాగే కొనసాగుతుందా?
ఇది ఇప్పుడు పరిగి ప్రజల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. అధికారుల స్పందన కోసం పరిగి ప్రజలు ఎదురుచూస్తున్నారు.




