Medchal: ఫిట్స్ అని డ్రామా ఆడాడు.. సీసీటీవీ కెమెరా అసలు రంగు బయటపెట్టింది!

Medchal: మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అల్లుడి దాడిలో అత్త మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

KARUNAKAR, UPPAL
Published on: 2 May 2026 9:36 AM IST
Medchal
X

Medchal: ఫిట్స్ అని డ్రామా ఆడాడు.. సీసీటీవీ కెమెరా అసలు రంగు బయటపెట్టింది!

మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని చెంగిచెర్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లుడి దాడికి గురై అత్త మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అల్లుడిని రిమాండ్ కి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య (19) ఏడాది క్రితం స్నేహిత్‌ తో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఇద్దరూ అదే కాలనీలో నివసిస్తున్నారు. కావ్య తల్లిదండ్రులు అదేకాలనీలోని మరో వీధిలో ఉంటున్నారు. కావ్యకు ఒక అక్క కూడా ఉంది. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లి ఇంటికి రావడంతో, తల్లి కొల్లా అరుణ (39) కావ్యను కూడా ఇంటికి పిలిచింది. ఆ రోజు మధ్యాహ్నం కావ్య తల్లి ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి, కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అరుణ మానసికంగా ఆందోళనకు గురైంది.

తరువాత రోజు (ఏప్రిల్ 29) మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతుండగా, అక్కడికి వచ్చిన స్నేహిత్ అత్తతో గొడవపడి బలవంతంగా బైక్‌ పై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్ వచ్చి బైక్‌ పై నుంచి పడిపోయిందని స్నేహిత్, కావ్యకు ఫోన్ ద్వారా తెలిపాడు. తొలుత అరుణను సమీపంలోని మెడిస్టార్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ ఆర్‌బీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కావ్య, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిజం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలలో స్నేహిత్, బైక్‌ పై వెళ్తూ అరుణతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం హెల్మెట్‌ తో తలకు దాడి చేయడంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుంచి ఆమె రోడ్డు పై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్‌ పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story