Vikarabad: విధుల నిర్వహణలో ఉన్న డ్రైవర్లకు రక్షణ కల్పిస్తాం.. ఎస్పీ

Vikarabad: ఆర్టీసీ బస్సులపై దాడులు, డ్రైవర్లను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 22 April 2026 9:46 PM IST
Vikarabad
X

Vikarabad: విధుల నిర్వహణలో ఉన్న డ్రైవర్లకు రక్షణ కల్పిస్తాం.. ఎస్పీ

Vikarabad: ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ (RTC) బస్సులను ధ్వంసం చేసినా లేదా వాటి రాకపోకలకు ఆటంకం కలిగించినా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్థం, విద్యార్థులు, ఉద్యోగులు మరియు రోగుల రవాణా కోసం నడిచే బస్సులు ఉమ్మడి ఆస్తి అని, వాటిపై దాడులు చేయడం వల్ల అంతిమంగా సామాన్య ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. ఏదైనా నిరసనలు లేదా ఆందోళనల సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బస్సులపై రాళ్లు రువ్వడం, అద్దాలు పగలగొట్టడం లేదా తగులబెట్టడం వంటి అరాచక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

విధుల నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లను, కండక్టర్లను అడ్డుకోవడం లేదా వారిపై శారీరక దాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కేవలం భౌతిక దాడులే కాకుండా, సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ హింసను ప్రేరేపించే వారిపై కూడా నిఘా ఉంచామని ఎస్పీ హెచ్చరించారు. ఆందోళనలు జరిగే ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు, నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, అల్లర్లలో పాల్గొనే వారిని వీడియో సాక్ష్యాధారాల ఆధారంగా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఒకసారి ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడమే కాకుండా, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని యువతను హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే అది శాంతియుత మార్గంలో, చట్టబద్ధమైన పద్ధతుల్లో మాత్రమే ఉండాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత భావోద్వేగాలకు లోనై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story