Tandur: శ్రీ చైతన్య స్కూల్లో 'బుక్స్' దందా.. ఆఫీస్ రూమ్‌ను సీజ్!
Tandur:
తాండూరు: పట్టణ కేంద్రంలోని పాత కుంటలో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాల అమ్మకానికి తెరతీసింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదని నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాల అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డి తన పర్సనల్ అకౌంట్ లోకి యూపీఐ పేమెంట్ చేయించుకుంటూ రెట్టింపు ధరలకు పుస్తకాలను పాఠశాల తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు.
డోర్ డెలివరీ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తూ రాత్రి 7, 8 గంటల ప్రాంతంలో ఇంటింటికి పుస్తకాలు చేరవేసే కార్యక్రమాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు.
గురువారం పుస్తకాల కోసం అధిక డబ్బులు చెల్లించిన తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ ని ఈ విషయాన్ని అడగడానికి వెళ్ళగా పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాఫర్ తనకు ఏమీ తెలియదని, పుస్తకాలు పాఠశాలలో అమ్మటం లేదని, డోర్ డెలివరీ చేస్తున్నారని చెప్పారు.
నేను పాఠశాలలో ఉద్యోగంలో చేరి ఒక్క నెల మాత్రమే అయిందని తనకు పాఠశాల వ్యవహారాలు ఏమీ తెలియదని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ప్రజా సంఘ నాయకులు తల్లిదండ్రులతో కలిసి పుస్తకాల విక్రయంపై పాఠశాల ప్రిన్సిపాల్ ని అడగగా తనకు ఈ విషయం తెలియదని, డోర్ డెలివరీ చేస్తున్నట్లు మాత్రమే తనకు తెలుసని, గత సంవత్సరం పుస్తకాల విక్రయాన్ని బుక్ డిపో కి అప్పగించిన సందర్భంలో ఐదు ఆరు లక్షల నష్టం రావడంతో ఈ సంవత్సరం ఏ గ్రూప్ బుక్ డిపోకు కూడా పుస్తకాల విక్రయాన్ని ఇవ్వలేదని వివరణ ఇచ్చారు.
అంతలో ప్రిన్సిపాల్ బాలవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో తాను ఉద్యోగం మాని వేస్తున్నానని, తనకి పుస్తకాల అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదని, తాను పాఠశాలకు రానని చెప్పాడని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు.
ఎంఈఓ ఇందుప్రియ పాఠశాలను తనిఖీ చేయగా పుస్తకాల విక్రీయం జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ ఒప్పుకోవడంతో ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేయించారు.
తాండూరులో మరెన్నో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు తీసుకుంటూ, పుస్తకాలను సొంతంగా విక్రయించుకుంటూ, 25% అల్ప సంఖ్యాక విద్యార్థులకు సీట్లు ఇవ్వాలనే నిబంధనలను తుంగలో తొక్కి విద్యాసంస్థలను నడిపించుకుంటున్నాయని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలపై చర్యలు తీసుకునే దిశగా తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఈ విధమైన చర్యలు ప్రైవేటు పాఠశాలలు మానుకోవాలని లేనిచో పాఠశాల ముందు బయటాయించి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




