Peerzadiguda: స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో ప్రారంభం..ప్రీతి రెడ్డి సందడి!

Peerzadiguda: పీర్జాదిగూడలో స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో 7వ బ్రాంచ్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ నేత వజ్రేష్ యాదవ్. వ్యాయామాలతో ఆకట్టుకున్న ప్రీతి రెడ్డి, శ్యామల.

KARUNAKAR, UPPAL
Published on: 5 Oct 2026 11:27 AM IST
Peerzadiguda
X

Peerzadiguda: స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో ప్రారంభం..ప్రీతి రెడ్డి సందడి!

Peerzadiguda: ఆరోగ్యకరమైన జీవనశైలికి వ్యాయామం ఎంతో అవసరమని, నిత్య జీవితంలో శారీరక దృఢత్వానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ సూచించారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో ఏడవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ ఫిట్‌నెస్ స్టూడియోను ప్రారంభించారు. టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫిట్‌నెస్ స్టూడియోలో బాక్సింగ్, డంబెల్‌తో పాటు వివిధ రకాల వ్యాయామాలు చేసి సందడి చేశారు. యువతతో కలిసి ఉత్సాహంగా వ్యాయామాలు చేస్తూ వారిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా వ్యాయామం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఫిట్‌నెస్ స్టూడియోలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ మేయర్ అమర్‌సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తవిటి ప్రశాంత్, పార్టీ అధికార ప్రతినిధి వెంకటేష్ గౌడ్, స్టార్ ఫిట్‌నెస్ స్టూడియో నిర్వాహకులు జావిద్ తదితరులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL