Hyderabad: నిరుద్యోగ సంక్షోభంపై ఏఐవైఎఫ్ సమరశంఖం
Hyderabad: ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసీఐఎల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర పాల్గొన్నారు.
Hyderabad: నిరుద్యోగ సంక్షోభంపై ఏఐవైఎఫ్ సమరశంఖం
Hyderabad: నిరుద్యోగ సంక్షోభం పై సమగ్ర విధాన మార్పులు అవసరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవంను పోరాట దినంగా పరిగణిస్తూ ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన యువజన సంఘ జెండాను ధర్మేంద్ర ఎగురవేశారు.అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై పోరాడుదామని, మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా పోరాడుదామని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ 1959 మే 3 న ఆవిర్బవించిందని, న్యూఢిల్లీలో జరిగిన ఆవిర్భావ మహాసభలో 11 రాష్ట్రాల నుండి 250కి పైగా ప్రతినిధులు, పరిశీలకులు పాల్గొన్నారని . ఆరు రోజులపాటు జరిగిన ఈ చారిత్రాత్మక సమావేశంలో అధికారికంగా ఏఐవైఎఫ్ ఏర్పాటును ప్రకటించారన్నారు . ఈ మహాసభలో సామ్యవాద ఆలోచనలను వ్యాప్తి చేయడం,
యువతను సామాజిక మార్పు దిశగా నడిపించడం ప్రధాన లక్ష్యాలుగా ఏర్పడిన మొదటి యువజన సంఘం ఏఐవైఎఫ్ అని అన్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయ యువజన ఐక్యతకు ప్రతీక అయిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెమొక్రటిక్ యూత్ (డబ్ల్యు ఫ్డివై) తో అనుబంధం ఏర్పరచుకోవాలని నిర్ణయించి, ప్రపంచ యువజన ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యిందన్నారు. భారతదేశ యువత ఈరోజులో తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం ఆర్థిక సమస్య కాదని ఇది దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణాత్మక సంక్షోభమన్నారు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పరిశీలిస్తే ప్రభుత్వ నియామకాలు తగ్గించబడుతున్నాయని, ప్రైవేటీకరణ వేగవంతమవుతోందని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతున్నాయని, విద్య ఖర్చులు పెరిగి యువతపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలు యువతను అస్థిరతలోకి నెట్టుతున్నాయన్నారు. ఉపాధి రంగంలో జాతీయ స్థాయిలో భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని,
ప్రభుత్వ ఖాళీలను నిర్థిష్ట సమయంలో భర్తీ చేయాలని, విద్య రంగంలో ఉచిత, నాణ్యమైన ఉన్నత విద్య, ఫీజుల నియంత్రణ అవసరమన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇస్తూ గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపుదల చేయాలని అన్నారు. యువత సంక్షేమం కోసం నిరుద్యోగ భృతి, మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి సల్మాన్ బేగ్, టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ యువతకు హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని,
ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తుందన్నారు. యువత సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది దేశ భవిష్యత్తును కాపాడే అత్యవసర కర్తవ్యమని ఉద్ఘటించారు .
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి బాబు, శేఖర్, నదీమ్, సాయిలు, ప్రతాప్, భరత్, ప్రకాష్, గణేష్,పవన్, ఏఐఎస్ఎఫ్ నేతలు మహేష్, అజీమ్ పాషా తదితరులు పాల్గొన్నారు.




