Kapra: మరో అరుదైన ఘనత సాధించిన న్యాయవాది సుంకర నరేష్‌

Kapra: తెలంగాణ రాష్ట్ర రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాప్రాకు చెందిన సుంకర నరేష్ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ASHOK, KAPRA
Published on: 26 Jun 2026 4:45 PM IST
Kapra
X

Kapra: మరో అరుదైన ఘనత సాధించిన న్యాయవాది సుంకర నరేష్‌

కాప్రా: కాప్రాకు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు సుంకర నరేష్ మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గచ్చిబౌలిలోని తెలంగాణ షూటింగ్ రేంజ్‌లో జూన్ 20 నుంచి 25 వరకు నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌ షిప్ లో ఆయన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

సీనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలోని 50 మీటర్ల పిస్టల్ ఫైర్ ఆర్మ్ (.22 బుల్లెట్) ఈవెంట్‌లో పాల్గొన్న సుంకర నరేష్ రాష్ట్ర స్థాయి అర్హత స్కోరును నమోదు చేసి సౌత్ జోన్, ఓపెన్ నేషనల్, ప్రీ-నేషనల్ షూటింగ్ పోటీలకు అర్హత పొందారు. ఈ విజయానికి గత కొన్ని నెలలుగా చేసిన కఠోర సాధనే కారణమని ఆయన తెలిపారు.

గచ్చిబౌలిలోని తెలంగాణ షూటింగ్ రేంజ్‌లో రాష్ట్ర ప్రధాన కోచ్ వారణాసి సందీప్ కుమార్ వద్ద ఆయన శిక్షణ పొందారు. ప్రముఖ నేషనల్ షూటర్ కిశోర్ పర్యవేక్షణలో నిరంతరం సాధన చేసి ఈ ఘనతను అందుకున్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ పట్టుదలతో ముందుకు సాగిన సుంకర నరేష్ ఈ విజయం సాధించడం విశేషం.

న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, మరోవైపు క్రీడల్లోనూ ప్రతిభ చాటటం పలువురి ప్రశంసలను అందుకుంటుంది. "సాధించాలనే సంకల్పం ఉంటే వయసు, సమయం ఎప్పుడూ అడ్డంకులు కావు" అనే విషయాన్ని తన కృషితో సుంకర నరేష్ మరోసారి నిరూపించారని పలువురు అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్ జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story