Suraram: ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించొద్దు: సూరారంలో ధర్నా!
Suraram: ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసుల పేరుతో అర్హులైన పేదల ఓట్లు తొలగించవద్దని డిమాండ్ చేస్తూ సూరారంలో గోగులపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Suraram: ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించొద్దు: సూరారంలో ధర్నా!
సూరారం: SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులు, ఆధారాల సమర్పణ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించి, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సూరారం కాలనీలో ధర్నా నిర్వహించారు. నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సూరారం కాలనీలోని లూయిస్ బ్రెయిలీ భవన్ ఎదుట ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఎస్సైఆర్ ప్రక్రియలో అనేక మంది ఓటర్లకు నోటీసులు అందుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. ముఖ్యంగా పేదలు, నిరక్షరాస్యులు, స్వంత ఇళ్లు లేని వారు, వలస కార్మికులు వంటి వర్గాల వద్ద అవసరమైన అన్ని పత్రాలు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
సరైన పత్రాలు అందుబాటులో లేని కారణంగా అర్హులైన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదు. అధికారిక డేటా నమోదు సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా జరిగే పొరపాట్లకు ఓటర్లు బాధ్యత వహించాల్సిన పరిస్థితి రాకూడదు” అని ఆయన అన్నారు. 1987 కన్నా ముందు అధికారిక పత్రాలు కావాలంటే ప్రస్తుతం వారి వయసు 50, 60 సంవత్సరాలకు పైబడి ఉండాలని, ఈ లోపు వయస్సున్న వారికి ఎలాంటి పత్రాలు అందుబాటులో ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాల విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను అధికారులు స్పష్టంగా నివృత్తి చేయాలని, అర్హులైన ఓటర్లకు తమ వివరాలను సరిదిద్దుకునేందుకు తగిన అవకాశం కల్పించాలని కోరారు. ఓటరు పేరు తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి సమాచారం ఇచ్చి, తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్సైఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, పేదలు మరియు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ధర్నాలో పాల్గొన్న పలువురు కోరారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షించబడేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ అంశంపై పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు చంద్రశేఖర్, రాము, రామకృష్ణ, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




