Tandur: తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. బాలింత కడుపులో కాటన్ పెట్టి కుట్లు!
Tandur: తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం.
Tandur: తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. బాలింత కడుపులో కాటన్ పెట్టి కుట్లు!
వికారాబాద్ జిల్లా: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి (MCH) లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది. డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
అసలేం జరిగిందంటే..?
బాధితుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండలం నావంగి గ్రామానికి చెందిన ఆర్తి అనే గర్భిణీ తన మొదటి కాన్పు కోసం మే 3వ తేదీన భర్త రమేష్‌తో కలిసి తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు బాబు పుట్టాడు. అయితే, మొదటి కాన్పు కావడంతో కాన్పు సమయంలో లోపల కాటన్ (పత్తి) పెట్టేసి, అలాగే కుట్లు (స్టిచెస్) వేశారు.
వెలుగులోకి వచ్చిన నిర్లక్ష్యం:
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారం రోజుల తర్వాత ఆర్తి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె అమ్మగారి ఇల్లు ఉన్న కర్ణాటకలోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లగా, అక్కడ స్థానిక వైద్యులు పరీక్షించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లోపల కాటన్ ఉంచి కుట్లు వేయడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని వారు నిర్ధారించారు. దీంతో అక్కడి వైద్యులు లోపల ఉన్న కాటన్‌ను తొలగించారు.
చేతులెత్తేసిన తాండూరు వైద్యులు:
ఇన్ఫెక్షన్ తీవ్రమై, జ్వరం విపరీతంగా రావడంతో బాధితులు మళ్లీ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ చేరిన 48 గంటలు గడిచినా పరిస్థితి అదుపులోకి రాకపోగా, జ్వరం తగ్గలేదు. దీంతో ఇక్కడి వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులెత్తేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆర్తిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
యమలోకంగా ప్రభుత్వ ఆసుపత్రి: కుటుంబ సభ్యుల ఆగ్రహం
"ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వస్తే ప్రాణాలు తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. పేదల ప్రాణాలంటే వీరికి లెక్కలేదు. మే 3న డెలివరీ చేసిన సదరు మహిళా వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ఆమె కాళ్లు వాపు రావడంతో వైద్యుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపించింది ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడేలా చేస్తున్నారు."
బాధితురాలి కుటుంబ సభ్యులు
ఈ ఘోర నిర్లక్ష్యానికి కారణమైన సదరు ల్యాబర్ రూమ్ వైద్యురాలు మరియు సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




