Kapra: డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె: ఎమ్మెల్యేకి వినతి

Kapra: రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత కోరుతూ డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు కాప్రాలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఆశా వర్కర్లు వినతిపత్రం ఇచ్చారు.

ASHOK, KAPRA
Published on: 10 Nov 2026 7:21 PM IST
Kapra
X

Kapra: డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె: ఎమ్మెల్యేకి వినతి

Kapra: రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య సేవల్లో కీలకంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎం.రేవతి కళ్యాణి డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

ఎమ్మెల్యే ను ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సుమారు 1,200 మంది ఆశా వర్కర్లు 20 ఏళ్లుగా ప్రజారోగ్య సేవలందిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు వైద్య సేవలు, తల్లీబిడ్డల సంరక్షణ, టీకాలు, కుటుంబ నియంత్రణతో పాటు అంటువ్యాధుల నివారణలో కీలకంగా వ్యవహరిస్తున్నా తమకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వస్తే వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. గతంలో ఉన్నతాధికారులు ఇచ్చిన రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం హామీ కూడా కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం, పీఎఫ్‌, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, రూ.50 లక్షల బీమా, రూ.5 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, పెన్షన్‌, వేతనంతో కూడిన సెలవులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

కనీస వేతనాన్ని రూ.30 వేలకు పెంచడంతో పాటు డీఏలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమ్మె పరిస్థితులను నివారించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA