Telangana: స్టైపెండ్ పెంపు కోరుతూ తెలంగాణలో ఆయుష్ వైద్యుల సమ్మె.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఆయుష్ వైద్యులు నిరవధిక సమ్మె చేపట్టారు. స్టైపెండ్ పెంపు కోరుతూ రామంతపూర్ హోమియో కాలేజీ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

KARUNAKAR, UPPAL
Published on: 4 Aug 2026 1:44 PM IST
Telangana
X

Telangana: స్టైపెండ్ పెంపు కోరుతూ తెలంగాణలో ఆయుష్ వైద్యుల సమ్మె.

స్టైపెండ్ పెంపే డిమాండ్, రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

రామంతపూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన.. ‘వివక్ష వీడాలి.. స్టైపెండ్ పెంచాలి’ అంటూ నినాదాలు

ఉప్పల్: స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్ రామంతపూర్‌లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని "కావాలి.. కావాలి.. న్యాయం కావాలి", "స్టైపెండ్ పెంచాలి", "ఆలస్యం కాదు.. న్యాయం చేయాలి" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైపెండ్ దేశంలోనే అత్యల్పమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ తో పోలిస్తే తెలంగాణలో చెల్లిస్తున్న స్టైపెండ్ సగం కంటే తక్కువగా ఉందని ఆరోపించారు. జీవన వ్యయం, వసతి, ఆహారం, ప్రయాణం, విద్యా ఖర్చులు విపరీతంగా పెరిగినా గత పదేళ్లుగా స్టైపెండ్‌ లో ఎలాంటి పెంపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జేఏసీ విమర్శించింది. 2016 వరకు అల్లోపతి, ఆయుష్ వైద్య విద్యార్థులకు సమానంగా స్టైపెండ్ ఉండేదని, ఆ తర్వాత అల్లోపతి విద్యార్థుల స్టైపెండ్‌ను దశలవారీగా పెంచుతూ వచ్చారని, అయితే ఆయుష్ విద్యార్థులను మాత్రం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా వివక్ష లేకుండా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ను తక్షణమే పెంచాలని ప్రభుత్వాన్ని జేఏసీ డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రోగుల మద్దతు

ఆయుష్ వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రోగులు కోరారు. సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్ పెంపుతో పాటు ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సమ్మె కొనసాగితే తమకు వైద్య సేవలు అంతరాయం కలిగే అవకాశం ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వారి డిమాండ్లను పరిష్కరించి, వైద్య సేవలు యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story