Telangana High Court: తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
Telangana High Court: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణిపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Telangana High Court: తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
Telangana High Court: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించిన కోర్టు, విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను సూచించింది.
అసలు వివాదం ఏంటి?
అస్సాం సీఎం భార్య రిణికి భూయాన్ శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేయడంతో పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో జరిగిన వాదనలు:
పిటిషనర్ తరఫున (అభిషేక్ మను సింఘ్వీ & రవీందర్ రెడ్డి): రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాదించారు. పవన్ ఖేరా భార్య హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారని, ఆయన ఇక్కడే నివసిస్తున్నందున ఈ పిటిషన్‌ను విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉందని స్పష్టం చేశారు.
అస్సాం ప్రభుత్వం తరఫున (దేవజిల్ షైకీ): ఇది సాధారణ పరువు నష్టం కేసు కాదని, సీఎం భార్యపై తప్పుడు ఆరోపణలు చేయడానికి నకిలీ పత్రాలను సృష్టించారని వాదించారు. పవన్ ఖేరా ఢిల్లీ నివాసి అని, హైదరాబాద్ నివాసినని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన, పవన్ ఖేరాకు వారం రోజుల పాటు మధ్యంతర ఊరటనిస్తూ ఈలోగా సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.


