Cyberabad: పోలీస్ బాస్‌లకు హైకోర్టు షాక్.. సైబరాబాద్ సీపీ, డీసీపీకి జైలు శిక్ష
తెలంగాణ హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్, మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష విధించింది.
Cyberabad: తెలంగాణలో పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని తేల్చిన న్యాయస్థానం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేశ్, మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా కట్టకపోతే అదనంగా మరో వారం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం ఈ తీర్పు వెలువరించారు.
జీడిమెట్లలో 6.15 ఎకరాల భూమి వివాదం
ఈ కేసు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 6.15 ఎకరాల భూమికి సంబంధించినది. ఈ భూమి విషయంలో ప్రవీణ్ అప్పలనేని, టీ.హర్షవర్ధన్ ప్రసాద్ మధ్య వివాదం కొనసాగుతోంది. 2022 అక్టోబర్‌లో భూమి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ప్రవీణ్‌కు, ఒప్పందం ప్రకారం వ్యవహారం ముందుకు సాగకపోవడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆయన సివిల్ కోర్టును ఆశ్రయించారు. భూమి స్వాధీనానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత భూమి విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూడాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని పిటిషన్
భూమి వివాదం పరిష్కారమయ్యే వరకు తన స్వాధీనంలో ఉన్న స్థలానికి రక్షణ కల్పించాలని ప్రవీణ్ హైకోర్టును కోరారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో గతంలో కూడా హైకోర్టు పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. 2026 ఫిబ్రవరి 13న ఇచ్చిన ఉత్తర్వుల్లో మధ్యంతర ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆదేశాలు అమలు కాలేదని పిటిషనర్ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి పోలీస్ అధికారుల వివరణను పరిశీలించారు.
సివిల్ వివాదం పేరుతో కోర్టు ఆదేశాలను పక్కన పెట్టలేరు
సివిల్ కోర్టులో భూ వివాదం పెండింగ్‌లో ఉందనే కారణంతో హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. భూమి విషయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, అయితే కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను విస్మరించడానికి వీల్లేదని పేర్కొంది. దర్యాప్తు పేరుతో సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఆదేశాల గురించి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన తర్వాత క్షమాపణ చెప్పడం మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించింది. అధికారులపై కోర్టు ధిక్కరణ నిర్ధారణకు ఇదే ప్రధాన కారణమైంది.
అప్పీల్‌కు వారం రోజుల గడువు
సీపీ, డీసీపీలకు విధించిన జైలు శిక్ష అమలును హైకోర్టు వారం రోజుల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో వారు చట్ట ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. వారం రోజుల్లో శిక్ష అమలుపై స్టే ఉత్తర్వులు పొందకపోతే హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్-1) ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో ప్రతివాదిగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌పై వ్యక్తిగతంగా ఆరోపణలు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని భావించిన న్యాయస్థానం ఆమెపై కోర్టు ధిక్కరణ విచారణను ముగించింది. దీంతో ఈ కేసులో సీపీ, డీసీపీలకు మాత్రమే జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.




