Ranga Reddy: రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు.. హైకోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే?
తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.
C Narayana Reddy
Ranga Reddy: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావించిన న్యాయస్థానం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది. తుర్కయాంజల్‌లోని కొన్ని ప్లాట్లను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలన్న వినతిపై తీసుకున్న చర్యలే ఈ కోర్టు ధిక్కరణ కేసుకు కారణమయ్యాయి.
తుర్కయాంజల్ భూముల వివాదమే కేసుకు కారణం
ఈ వివాదం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజల్ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట ప్రాంతానికి సంబంధించినది. అక్కడి సర్వే నంబర్లు 536, 537, 657, 658 పరిధిలో ఉన్న ప్లాట్ల విషయంలో సమస్య తలెత్తింది. తమకు చెందిన 59వ ప్లాట్, 62వ ప్లాట్ తూర్పు భాగాన్ని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని పి. శివలీల, ఆమె భర్త అధికారులను కోరారు. ఇందుకోసం 2024 మార్చి 14న అప్పటి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినా..
బాధితుల పిటిషన్‌పై 2025 ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు, వారి దరఖాస్తును పరిశీలించి 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అభ్యర్థనను అంగీకరించకపోయినా అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. కోర్టు ఆదేశాల కాపీని కలెక్టర్‌కు 2025 ఆగస్టు 11న అందించినట్లు తీర్పులో పేర్కొన్నారు. గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంతో బాధితులు అదే ఏడాది అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలైన తర్వాతే అధికారులు స్పందించి 2026 ఫిబ్రవరి 26న వారి అభ్యర్థనను తిరస్కరించారు. అనంతరం జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు ఇచ్చారు.
పక్క ప్లాట్లకు అనుమతి.. వీరికి మాత్రం నిరాకరణ
విచారణలో మరో కీలక అంశాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇదే లేఅవుట్లోని పక్క ప్లాట్లను గతంలో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించిన విషయాన్ని గుర్తుచేసింది. 62వ ప్లాట్ పశ్చిమ భాగంతో పాటు మరో రెండు ప్లాట్లను 2022లో అప్పటి కలెక్టర్ జాబితా నుంచి తొలగించారు. కానీ పిటిషనర్లకు చెందిన ప్లాట్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఒకే ప్రాంతంలోని ప్లాట్లకు వేర్వేరు విధానాలు ఎందుకు అనుసరించారో సరైన వివరణ లేదని పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడం సాధ్యం కాకపోతే అప్పీల్‌కు వెళ్లాలి తప్ప వాటిని పట్టించుకోకుండా ఉండకూడదని జస్టిస్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఉద్దేశపూర్వక ధిక్కరణగా పరిగణించిన కోర్టు
కలెక్టర్‌కు కోర్టు ఆదేశాల గురించి తెలిసినా నిర్దేశించిన 60 రోజుల గడువులో చర్యలు తీసుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే విచారణ ప్రక్రియ మొదలుపెట్టి, అభ్యర్థనను తిరస్కరించారని తీర్పులో పేర్కొంది. కలెక్టర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, ఆయన చర్యలు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా ఉన్నాయని తేల్చింది. దీంతో కోర్టు ధిక్కరణ చట్టం-1971లోని సెక్షన్ 12 ప్రకారం సి.నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ, అప్పీల్ చేసుకునే అవకాశం కోసం జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది. అంటే శిక్ష రద్దు కాలేదు.. అప్పీల్ కోసం తాత్కాలికంగా అమలును మాత్రమే వాయిదా వేసింది.




