Shamshabad: కస్తూరిబా గాంధీ ట్రస్ట్‌ను సందర్శించిన 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు!
Shamshabad: తెలంగాణ పోలీస్ అకాడమీకి చెందిన 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు హైదర్‌షాకోట్‌లోని కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌ను సందర్శించి, ₹56,000 విరాళం అందజేశారు.
Shamshabad: కస్తూరిబా గాంధీ ట్రస్ట్‌ను సందర్శించిన 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు!
శంషాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు గ్రేటర్ హైదరాబాద్ శివారు గండిపేట మండలం హైదర్ షా కోట్ లో ఉన్న కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌ను సందర్శించారు. సమాజంలోని అణగారిన, ఆపన్న వర్గాల పట్ల పోలీసు అధికారుల్లో మానవతా దృక్పథం, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్శనలో ట్రైనీ అధికారులు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్, ప్రజ్వల రెస్క్యూ హోమ్, మానసిక వైకల్యంతో ఉన్న వారికి అందిస్తున్న సేవా కేంద్రాలు, మహిళలకు శిక్షణ అందించే కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
హోమ్స్‌లో నివసిస్తున్న వృద్ధులు, రక్షించబడిన మహిళలు, ప్రత్యేక సంరక్షణ అవసరమైన వారితో ట్రైనీ డీఎస్పీలు ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం, భరోసా కల్పిస్తూ పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు అందరికీ స్నాక్స్ పంపిణీ చేశారు.
ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై అవగాహన.
ట్రస్ట్ ఇన్‌చార్జిలు మూర్తి, శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు ట్రైనీ డీఎస్పీలకు ట్రస్ట్‌లోని వివిధ విభాగాలను పరిచయం చేసి, అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సేవా విధానం, బాధితుల పునరావాసం తదితర అంశాలను వివరించారు. కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన నేపథ్యాన్ని, దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం.
ట్రస్ట్‌లో మహిళలకు వివిధ రకాల నైపుణ్య శిక్షణలు అందిస్తూ వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాలను కూడా ట్రైనీ అధికారులు పరిశీలించారు. మహిళలు స్వయంగా తయారు చేసిన జ్యూట్ బ్యాగులను ట్రైనీ డీఎస్పీలు కొనుగోలు చేసి, వారి నైపుణ్యానికి, స్వయం ఉపాధి ప్రయత్నాలకు ప్రోత్సాహం అందించారు.
మానవతా దృక్పథంతో ₹56 వేల విరాళం.
ట్రస్ట్‌లోని వృద్ధులు, రక్షించబడిన మహిళలు, ప్రత్యేక సంరక్షణ అవసరమైన వారిని కలుసుకున్న అనంతరం వారి పరిస్థితులకు చలించిన ట్రైనీ డీఎస్పీలు తమ వంతు సామాజిక బాధ్యతగా 56 వేల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని ట్రస్ట్ ఇన్‌చార్జి మూర్తికి ట్రైనీ అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు మాట్లాడుతూ, సమాజంలో వివిధ కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం తమకు ఎంతో విలువైన అనుభవమని పేర్కొన్నారు. ఇలాంటి సందర్శనలు భవిష్యత్ పోలీసు అధికారుల్లో సానుభూతి, మానవత, సేవా భావం, సామాజిక బాధ్యత మరింత పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
పోలీసు శిక్షణలో సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం.
పోలీసు అధికారుల విధులు కేవలం నేర నియంత్రణ, దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, బాధితులకు అండగా నిలవడం, బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, సమాజంతో మానవీయ సంబంధాలను పెంపొందించడం కూడా ముఖ్యమని ట్రైనీ డీఎస్పీలు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్శనకు అవకాశం కల్పించిన తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఐపీఎస్ కు ట్రైనీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శిక్షణలో తరగతి గది బోధనతో పాటు సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిచయం చేసే ఇలాంటి ఫీల్డ్ విజిట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. డి.ఎస్.పి ఆదూరి శ్రీనివాసరావు ట్రైనీ డిఎస్ పి ల ఈ సందర్శన కార్యక్రమానికి లైజన్ ఆఫీసర్ గా వ్యవహరించారు.




