hyderabad: ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
hyderabad: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎంసిఆర్ హెచ్ఆర్డీ సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
hyderabad: ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ లక్ష్య సాధనకు పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్య మానవ వనరులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
హైదరాబాద్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 'ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానాలు' అనే అంశంపై జరిగిన చర్చలో దేశ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన అంశాలను వివరించారు.
దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వృద్ధి అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు చేరాలని మంత్రి అన్నారు. ఆర్థికాభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరుగుదల మాత్రమే కాదని, ప్రజల ఆదాయాలు పెరగడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఆదాయం పెరిగి సంక్షేమ కార్యక్రమాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి రావడమని వివరించారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఏటా 8 శాతం స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని, ఇందుకోసం దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఆధునిక శిక్షణ సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి మరో 54 ఏటీసీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా శిక్షణ పాఠ్యప్రణాళిక రూపొందించామని తెలిపారు. పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి కోర్సులను రూపొందించడంతో పాటు బోధనా సిబ్బందికి కూడా ఆధునిక సాంకేతికతపై శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో అందించే శిక్షణకు, పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్ పెరుగుతోందని మంత్రి అన్నారు. ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో పాటు స్థానిక భాష, పని సంస్కృతి, క్రమశిక్షణపై యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ ఉద్యోగాల ద్వారా యువతకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు, వారు స్వదేశానికి పంపే నగదు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒకే నైపుణ్యంతో కొనసాగడం సాధ్యం కాదని, యువత నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ఈ లక్షణాలను పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు.
ఐదు దశాబ్దాలుగా మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను మంత్రి అభినందించారు. పరిశోధన, విజ్ఞాన మార్పిడి, అనుభవాల పంచుకోవడం ద్వారా ఇలాంటి సంస్థలు దేశాభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షించారు. దేశం, సమాజం, భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.




