LB Nagar: చింతలకుంటలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటుపై తీవ్ర ఉద్రిక్తత!

LB Nagar: ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంటలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును స్థానికులు, భూ యజమానులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Oct 2026 1:51 PM IST
LB Nagar
X

LB Nagar: చింతలకుంటలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటుపై తీవ్ర ఉద్రిక్తత!

LB Nagar: విజయవాడ జాతీయ రహదారిపై చింతలకుంట వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల నిలుపుదల కోసం బస్టాండ్‌ ఏర్పాటు చేసే ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ప్రైవేట్‌ స్థలంలో గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు పనులు ప్రారంభించగా.. స్థానిక భూ యజమానులు, కాలనీవాసులు తీవ్రంగా అడ్డుకున్నారు.

బస్టాండ్‌ ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని అధికారులు చెప్పడంతో.. వాటిని చూపించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. అయితే, అధికారిక పత్రాలు చూపించకపోవడంతో వారం రోజుల్లో ఉత్తర్వులు చూపిస్తామని అధికారులు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బస్టాండ్‌ కోసం తవ్విన గుంతలను పూడ్చివేసి అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

మరోవైపు, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు బస్సులు నిలపడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు మూత్రవిసర్జన తదితర అవసరాల కోసం కాలనీలోకి రావడంతో మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నివాస ప్రాంతాల మధ్య బస్టాండ్‌ ఏర్పాటు చేస్తే సహించేది లేదని, తమ కాలనీ ప్రశాంతతకు భంగం కలిగితే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR