TG EAPCET 2026: మే 9 నుంచి ఇంజినీరింగ్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
TG EAPCET 2026: తెలంగాణ టీజీ ఈఏపీసెట్ 2026 పరీక్షలకు జేఎన్‌టీయూహెచ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 9 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 2.10 లక్షల మంది హాజరుకానున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనర్ స్పష్టం చేశారు.
TG EAPCET 2026: మే 9 నుంచి ఇంజినీరింగ్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
హైదరాబాద్: టీజీ ఈఏపీసెట్-2026 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు జేఎన్‌టీయూహెచ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 9, 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 2 లక్షల 10 వేల 766 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌లో పేర్కొన్న తేదీ, సమయం, పరీక్షా కేంద్రానికే హాజరు కావాలని కన్వీనర్ డాక్టర్ కె. విజయ కుమార్ రెడ్డి సూచించారు.
పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, ఉదయం సెషన్‌కు 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్‌కు 1:30 గంటల నుంచి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరినీ హాల్ నుంచి బయటకు వెళ్లనివ్వరని చెప్పారు.
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు సహా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.
పరీక్ష అనంతరం ప్రిలిమినరీ కీ ఆధారంగా మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయని, తుది కీ ప్రకారం నార్మలైజ్డ్ మార్కులతో ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని జేఎన్‌టీయూహెచ్ విజ్ఞప్తి చేసింది.




