Hyderabad: ఉప్పల్ స్టేడియంలో టీజీ20 సందడి.. జూలై 12న గ్రాండ్ ఫైనల్!

Hyderabad: HCA తిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20–2026 లీగ్ యువ క్రికెటర్ల కలలను సాకారం చేసే గొప్ప వేదిక అని లీగ్ కౌన్సిల్ చైర్మన్ వి. అగంరావు పేర్కొన్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 5 July 2026 6:13 PM IST
Hyderabad
X

Hyderabad: ఉప్పల్ స్టేడియంలో టీజీ20 సందడి.. జూలై 12న గ్రాండ్ ఫైనల్!

ఉప్పల్: తెలంగాణ క్రికెట్ అభివృద్ధికి బలమైన పునాది వేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20–2026 లీగ్ రోజురోజుకూ మరింత ఆదరణ పొందుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ఈ ఫ్రాంచైజీ టోర్నీ యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత వేదికగా నిలుస్తోందని టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వి. అగంరావు పేర్కొన్నారు.

ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ఒకే వేదికపై సమావేశమై పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు.

అనంతరం వి. అగంరావు ఆటగాళ్లతో ప్రత్యేకంగా సమావేశమై వారి ప్రదర్శన, క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అగంరావు మాట్లాడుతూ, "టీజీ20 కేవలం ఒక క్రికెట్ టోర్నీ మాత్రమే కాదు.. తెలంగాణ యువ క్రికెటర్ల కలలను సాకారం చేసే గొప్ప వేదిక. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఐపీఎల్ ప్రమాణాలతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా టీజీ20కు గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నాం.

ఈ లీగ్ ద్వారా ప్రతిభావంతులైన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌తో పాటు భారత జట్టుకు చేరే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలను నిర్వహిస్తూ తెలంగాణ క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు హెచ్‌సీఏ కట్టుబడి ఉంది" అని తెలిపారు. ప్రస్తుతం టీజీ20–2026 లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పోటీపడుతున్నాయి. 28 లీగ్ మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్‌తో కలిపి మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 24 లీగ్ మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నాయి.

అనంతరం ప్లేఆఫ్ పోరు ప్రారంభం కానుంది. ఫైనల్ జూలై 12జరగనుంది. ఈ సందర్భంగా పలువురు యువ క్రికెటర్లు మాట్లాడుతూ, హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌లో ఆడే అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుకుని ఈ లీగ్‌కు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ వేదిక ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే లక్ష్యమని చెప్పారు.

టీజీ20లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక లీగ్‌లలో అవకాశాలు లభించే అవకాశం ఉందని, తెలంగాణకు మరింత పేరు తీసుకురావడానికి శ్రమిస్తామని పేర్కొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story