TG20 League: ఉప్పల్ లో మొదలైన క్రికెట్ పండుగ.. ‘TG20 లీగ్’ గ్రాండ్ లాంచ్!

TG20 League: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో టీజీ20 (TG20) లీగ్–2026 క్రికెట్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది.

KARUNAKAR, UPPAL
Published on: 21 Jun 2026 8:14 PM IST
TG20 League
X

TG20 League: ఉప్పల్ లో మొదలైన క్రికెట్ పండుగ.. ‘TG20 లీగ్’ గ్రాండ్ లాంచ్!

ఉప్పల్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీజీ20 లీగ్–2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవన్ రెడ్డి, బీసీసీఐ ఏపీక్స్ కౌన్సిల్ సభ్యుడు వి. చాముండేశ్వర్‌నాథ్, తెలంగాణ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆఘం రావు పాల్గొని టోర్నీకి శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరితో వేడుకలు ప్రారంభమయ్యాయి.

అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు, 160 మంది క్రికెటర్లు పాల్గొంటుండగా, మొత్తం 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. విజేత జట్టుకు రూ.1 కోటి నగదు బహుమతి అందజేయనున్నారు. తొలి మ్యాచ్‌లో ఖమ్మం జట్టు, పాలమూరు జట్టుతో రాత్రి 7 గంటలకు తలపడుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడాభిమానులు, యువత, క్రికెట్ ప్రేమికులు హాజరై ఉత్సాహాన్ని నింపారు.

స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొనగా, కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా బీసీసీఐ ఏపీక్స్ కౌన్సిల్ సభ్యుడు వి. చాముండేశ్వర్‌నాథ్ మాట్లాడుతూ టీజీ20 లీగ్ పూర్తిగా బీసీసీఐ ఆమోదంతో నిర్వహిస్తున్న అధికారిక టోర్నమెంట్ అని స్పష్టం చేశారు. ఆటగాళ్లు, ప్రాయోజకులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని,

బీసీసీఐ నిబంధనల ప్రకారమే టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో యువ క్రికెటర్లకు ప్రతిభను నిరూపించుకునే వేదికగా టీజీ20 నిలుస్తుందని, రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి ఈ లీగ్ కీలకంగా మారుతుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. టీజీ20 ప్రారంభంతో తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఊపు వచ్చిందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story