LB Nagar: ఎల్బీనగర్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ!
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్డు వద్ద ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది.
LB Nagar: ఎల్బీనగర్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ!
ఎల్బీనగర్: ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్ ఫ్లైఓవర్ కింద ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అమ్మవారి బంగారు ఆభరణాలతో పాటు హుండీలోని నగదును అపహరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బైరామల్‌గూడకు చెందిన రేవు రఘు (48) రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 12న సాయంత్రం 4.30 గంటలకు ఆలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఆలయానికి వచ్చేసరికి ఇనుప గ్రిల్స్ గేటుకు వేసిన తాళం పగులగొట్టి కనిపించింది.
ఆలయం లోపల పరిశీలించగా స్టీల్ హుండీని కూడా దుండగులు పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అలాగే అమ్మవారికి చెందిన 4 గ్రాముల బంగారు పుస్తెలు, 5 గ్రాముల బంగారు ముక్కుపుడక కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆలయ చైర్మన్ రేవు రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 1217/2026, BNS సెక్షన్లు 331(4), 305(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




