Tragedy on Diwali: దీపావళి వేళ విషాదం.. ORRపై ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..!

Tragedy on Diwali: దీపావళి పండుగ వేళ హిమాయత్ సాగర్ ORR వద్ద ఘోర ప్రమాదం. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Gagan kumar
Published on: 9 Nov 2026 7:43 AM IST
Tragedy on Diwali
X

Tragedy on Diwali: దీపావళి వేళ విషాదం.. ORRపై ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..!

Himayat Sagar ORR accident: వెలుగుల పండుగ దీపావళి వేళ హైదరాబాద్ నగర శివారులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంతోషంగా పండుగ జరుపుకోవాల్సిన రోజున ఈ దుర్ఘటన జరగడంతో బాధిత కుటుంబాల్లో తీరని శోకఛాయలు అలముకున్నాయి.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలో జరిగిన ఒక శుభకార్యంలో క్యాటరింగ్ పనులు ముగించుకుని, పనివారందరూ ఆటోలో స్వస్థలాలకు తిరిగి బయలుదేరారు. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. టిప్పర్ ఢీకొన్న తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఏకంగా 23 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రమాద స్థలంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాద స్థలంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.