Hyderabad: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. లైట్ల ఆర్చ్ కూలి విద్యార్థి మృతి.. 14 మందికి గాయాలు

Hyderabad: హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్ ప్రాంతంలోని MVSR ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

CR Reddy
Published on: 18 Oct 2026 8:56 AM IST
Tragic Accident
X

Tragic Accident

Hyderabad: హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్ ప్రాంతంలోని MVSR ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీలో జరిగిన సాంస్కృతిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమం సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. విద్యార్థినులు అందరూ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా, విద్యుత్ దీపాలు అలాగే అలంకరణలతో కూడిన భారీ ఇనుప ఆర్చ్ (కమాన్) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సోని నారాయణ్ దాస్ అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడం కళాశాల వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటన పై కాలేజీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ స్పందిస్తూ.. కాలేజీలో సంగమం పేరుతో ప్రతి ఏటా నిర్వహించే టెక్నికల్ అలాగే కల్చరల్ ఫెస్ట్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. విద్యార్థుల ప్రత్యేక కోరిక మేరకు సాయంత్రం సమయంలో దాండియా కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఈవెంట్ ముగియడానికి కేవలం 10 నిమిషాల ముందు ఒక్కసారిగా వీచిన తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ దీపాల స్టాండ్ నిలబడలేక కూలిపోయిందని వివరించారు. అంబులెన్స్ వచ్చేందుకు సమయం పడుతుందనే ఉద్దేశంతో కాలేజీ వాహనాల్లోనే క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం గాయపడిన మిగతా విద్యార్థులందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, వారు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

ఈ హృదయవిదారక ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోలిన విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఈ అనూహ్య ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

కళాశాల యాజమాన్యం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే అమాయక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ నాయకులు మండిపడ్డారు. బీజేపీ నేత అండేలా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ, కాలేజీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా సుమారు 80 అడుగుల ఎత్తులో భారీ పిల్లర్లు ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధ్యులైన కాలేజీ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం కళాశాల ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.