Saroornagar: సరూర్‌నగర్ సభ అనుమతులపై ఆధారాలు బయటపెట్టిన దూగుంట్ల నరేష్!

Saroornagar: సరూర్‌నగర్ సభ అనుమతులపై ఆధారాలు బయటపెట్టిన తెలంగాణ రక్షణ సేన నేత దూగుంట్ల నరేష్. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఫైర్.. బీసీలకు 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 17 Sept 2026 11:44 PM IST
Saroornagar
X

Saroornagar: సరూర్‌నగర్ సభ అనుమతులపై ఆధారాలు బయటపెట్టిన దూగుంట్ల నరేష్!

Saroornagar: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సంకల్ప సభకు అనుమతులు ఎలా వచ్చాయనే అంశంపై తెలంగాణ రక్షణ సేన ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దూగుంట్ల నరేష్‌ ప్రజాపతి ప్రశ్నించారు. గురువారం ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీఆర్ఎస్‌–కాంగ్రెస్‌ ఒక్కటేనని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెబుతూ.. అదే సమయంలో టీఆర్ఎస్‌ సభకు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అనుమతులు వచ్చాయని చెప్పడం వైరుధ్యంగా ఉందని నరేష్‌ అన్నారు.

సభకు సంబంధించిన అనుమతులు, చెల్లింపు రసీదులు, అధికారిక లేఖలు, ప్రభుత్వ ఆదేశాల కాపీలను మీడియా ముందు ప్రదర్శించినట్లు తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు ఆ పత్రాలను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లు విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

బీఆర్‌ఎస్‌–బీజేపీ పొత్తుపై కేటీఆర్‌ స్పష్టత ఇవ్వాలి

బీఆర్‌ఎస్‌–బీజేపీ కలిసి పనిచేయడంపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా నరేష్‌ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభిప్రాయమా? అనేది పార్టీ అధికారికంగా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

జీవో 118.. రిజిస్ట్రేషన్‌ సమస్యలపై ప్రశ్నలు

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్‌ సమస్యలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని నరేష్‌ తెలిపారు. జీవో 118 ద్వారా ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో, బాధితుల సమస్యలకు పూర్తి పరిష్కారం ఎందుకు లభించలేదో సుధీర్‌రెడ్డి ప్రజలకు వివరించాలని కోరారు.

కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌ తదితర ప్రాంతాల్లో భూ వ్యవహారాలు, అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే ఆధారాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని అన్నారు.

బీసీలకు 50 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతూ 50 శాతం వాటా కల్పించాలనే డిమాండ్‌తో తమ పోరాటం కొనసాగుతుందని నరేష్‌ ప్రజాపతి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జీవో 97, రైతులు, దళితుల భూముల సమస్యలపై కూడా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దశలవారీగా ఆందోళనలు చేపడతామని నరేష్‌ ప్రజాపతి హెచ్చరించారు. ఎల్‌బీనగర్‌ ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR