Hyderabad: ఖైరతాబాద్ టీఎస్‌ఎండీసీ ఆఫీస్ వద్ద ఇసుక లారీ యజమానుల ధర్నా!
Hyderabad: ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో జరిగే అదనపు వసూళ్లను నిరసిస్తూ ఖైరతాబాద్‌లోని TSMDC ఎండీ ఆఫీస్ వద్ద జంట నగరాల ఇసుక లారీ ఓనర్ల అసోసియేషన్ ఆందోళన చేపట్టింది.
Hyderabad: ఖైరతాబాద్ టీఎస్‌ఎండీసీ ఆఫీస్ వద్ద ఇసుక లారీ యజమానుల ధర్నా!
Hyderabad: అక్రమ వసూళ్లను అరికట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) ఎండీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సర్వీ రాజు గౌడ్ మాట్లాడుతూ.. లోడింగ్ పేరుతో జరుగుతున్న అదనపు వసూళ్లను పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు.డ్రైవర్లను బెదిరించడం, దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్న ర్యాంపులపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ర్యాంపులను బ్లాక్‌లిస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
‘బగర్ సీరియల్’ పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, వాటిని ప్రోత్సహించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టి అడ్డుకోవాలని కోరారు.తమ సమస్యలపై పలుమార్లు టీఎస్‌ఎండీసీ ఎండీకి వినతిపత్రాలు అందజేసినా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని రాజు గౌడ్ ఆరోపించారు.
కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్ల కారణంగా ఇసుక రవాణా వ్యయం పెరిగి, చివరకు ఆ భారం ప్రజలపైనే పడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, అవినీతికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




