Hyderabad: పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగుల ఆత్మీయ సమ్మేళనం. పెండింగ్ జాబ్ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఆస్మా డిమాండ్.
Hyderabad: పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి!
Hyderabad: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఆస్మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆస్మా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు కావస్తున్నా ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కనీసం లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగడం ఆందోళనకరమని, ఇందుకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి జీఓ నంబర్ 31లో అనేక లోపాలు ఉన్నాయని, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శకాలు ఉన్నాయని ఆరోపించారు. వాటిని శాస్త్రీయంగా సవరించి నియామకాలు చేపట్టాలని కోరారు.
జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, డీఎస్సీ తదితర విభాగాల్లో ఖాళీలున్నప్పటికీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బిశ్వాల్ కమిటీ, శాంతికుమారి కమిటీలు కూడా ఉద్యోగ ఖాళీలను గుర్తించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
మెగా డీఎస్సీ, డిగ్రీ లెక్చరర్, గురుకుల, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ దరఖాస్తులకు రూ.వెయ్యి ఫీజు వసూలు చేయడం ఎన్నికల మేనిఫెస్టో హామీలకు విరుద్ధమని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి, జాబ్ క్యాలెండర్ను అమలు చేసిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని స్పష్టం చేశారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల శక్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపిస్తామని ఆస్మా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎల్ మూర్తి, రాజేష్, ఉదయ్, అమర్నాధ్, హరీష్, పుష్ప, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.




