Uppal: ఆయుర్వేద పెయిన్‌కిల్లింగ్ నూనె తాగి పదో తరగతి విద్యార్థి మృతి
Uppal: ఉప్పల్‌లో విషాదం. పరీక్షల ఒత్తిడి, కడుపునొప్పితో ఆయుర్వేద పెయిన్‌కిల్లింగ్ నూనె తాగి 10వ తరగతి విద్యార్థి రుద్రదేవ్ మృతి.
Uppal: ఆయుర్వేద పెయిన్‌కిల్లింగ్ నూనె తాగి పదో తరగతి విద్యార్థి మృతి
ఉప్పల్: కడుపునొప్పి, పదో తరగతి పరీక్షలపై ఒత్తిడితో బాధపడుతున్న 14 ఏళ్ల విద్యార్థి ఇంట్లో ఉన్న ఆయుర్వేద పెయిన్‌కిల్లింగ్ నూనె తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్వరూప్‌నగర్‌లోని ఎల్‌వీఆర్ బాలాజీ నీలాద్రి అపార్ట్‌మెంట్స్‌లో నివాసముండే వులిగొండ రుద్రదేవ్ (14) బోడుప్పల్‌లోని జీనాస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
రెండు నెలల క్రితం వెన్నెముకకు శస్త్రచికిత్స జరగడంతో కొంతకాలం ఇంటివద్ద విశ్రాంతి తీసుకున్నాడు. ఇటీవలే పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు పీర్జాదిగూడలోని అంకుర ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. రాత్రి 9.30 గంటల సమయంలో మందు వేసుకున్న అనంతరం రుద్రదేవ్ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు.
ఈ సమయంలో పదో తరగతి పరీక్షల విషయంలో ఒత్తిడి, భయంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సాయంత్రం 5.30 గంటల సమయంలో కడుపునొప్పి కారణంగా ఇంట్లో ఉన్న గౌల్తేరియా ఆయుర్వేద పెయిన్‌కిల్లింగ్ నూనెను తాగినట్లు రుద్రదేవ్ చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు తొలుత చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచనతో బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి రాత్రి 11.45 గంటలకు చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న రుద్రదేవ్‌ను గురువారం ఉదయం 10.14 గంటలకు వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం, ఆరోపణలు లేవని పోలీసులకు తెలిపారు. ఆయుర్వేద నూనె తీసుకోవడం, పరీక్షల ఒత్తిడి తదితర కారణాల నేపథ్యంలో ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




