Uppal: ఎంఎంసీ ఆధ్వర్యంలో ఉప్పల్లో బతుకమ్మ సంబరాలు!
Uppal: ఉప్పల్ మినీ స్టేడియంలో MMC ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీ సుమతి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా మహిళలతో కలిసి ఆడిపాడారు.
Uppal: ఎంఎంసీ ఆధ్వర్యంలో ఉప్పల్లో బతుకమ్మ సంబరాలు!
ఉప్పల్: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే మహిళా ఉద్యోగులు, కార్మికులు సైతం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రత్యేక వేడుకలకు శ్రీకారం చుట్టింది.
ఉప్పల్ మినీ స్టేడియం (మున్సిపల్ గ్రౌండ్)లో బుధవారం జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, మహిళా సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మ రోజున ప్రజలకు సేవలందించడంలో నిమగ్నమయ్యే మహిళా సిబ్బందికి పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం పరిమితంగా ఉంటుందని గుర్తించిన ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆయన ఆదేశాల మేరకు రాధికా గుప్తా ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని మూడు జోన్లు, 14 సర్కిళ్లకు చెందిన మహిళా డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు, మహిళా కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.
పోలీస్ కమిషనర్ సుమతి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా మహిళా డిప్యూటీ కమిషనర్లు, ఇతర సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో భాగస్వాములయ్యారు. పూల సోయగాలు, మహిళల ఆటపాటలతో మినీ స్టేడియం పండుగ శోభను సంతరించుకుంది. మహిళా ఉద్యోగులు, కార్మికులు తమ విధులతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ఆనందంగా జరుపుకునేలా ప్రత్యేక వేడుకలు నిర్వహించడంపై మహిళా సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించిన ఈ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




