Uppal Elevated Corridor: వాహనదారులకు అలెర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ మళ్లింపు..

Uppal Elevated Corridor: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ రోడ్డు మార్గం తాత్కాలిక మూసివేత.

KARUNAKAR, UPPAL
Published on: 7 May 2026 6:53 PM IST
Uppal Elevated Corridor
X

Uppal Elevated Corridor: వాహనదారులకు అలెర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ మళ్లింపు..

ఉప్పల్: నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ రాధికా గుప్తా, ఎల్‌.బీ నగర్ జోనల్ కమిషనర్ శ్రీవికాస్ మహతో గురువారం సంయుక్తంగా పరిశీలించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన అధికారులు, ట్రాఫిక్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి వరంగల్ రోడ్ వైపు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ రద్దీకి కేంద్రంగా మారే అవకాశం ఉన్న నాగోల్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలను కూడా కమిషనర్లు పరిశీలించారు. రద్దీ ఏర్పడే చోక్ పాయింట్లను గుర్తించి, ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేపట్టాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులపై స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ తో పాటు ఉప్పల్, ఎల్‌.బీ నగర్ జోన్లకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story