Uppal: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముసుగులో గంజాయి దందా
Uppal: హైదరాబాద్ ఉప్పల్ లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న షంషీర్ అలీ ఖాన్‌ను ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Uppal: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముసుగులో గంజాయి దందా
ఉప్పల్: యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న గంజాయి అక్రమ విక్రయాలపై ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహణ పేరుతో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 4.2కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓంకార్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఉప్పల్‌లోని నల్ల చెరువు కట్ట బస్ స్టాప్ వెనుక భాగంలో తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న షంషీర్ అలీ ఖాన్ (32)ను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విక్రయాల వ్యవహారం బయటపడింది. నిందితుడి వద్ద నుంచి సుమారు 4 గ్రాముల చొప్పున ప్యాక్ చేసిన 1,014 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓంకార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తం 4.2 కిలోలుగా ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గంజాయి విక్రయాలకు ఉపయోగిస్తున్న ఒక వివో మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు నాగ్‌పూర్ నుంచి ఒక్కో.గంజాయి ప్యాకెట్‌ను రూ.100 చొప్పున కొనుగోలు చేసి, నారపల్లిలో తాను నిర్వహిస్తున్న "వసీమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్"కు వచ్చే వినియోగదారులకు ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం ముసుగులో గంజాయి విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ ఓంకార్ పేర్కొన్నారు.
అంతేకాకుండా నిందితుడిపై గతంలోనే బీబీనగర్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం కింద కేసు నమోదై ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఉప్పల్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓంకార్ హెచ్చరించారు.




