Uppal: సొంత భవనం లేక ఉప్పల్ ఎక్సైజ్ పీఎస్ అవస్థలు
Uppal: సొంత భవనం లేక, రోడ్డుపైనే స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించిన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. అద్దె చెల్లింపులు నిలిచిపోవడంతో యజమాని ఒత్తిడి.
Uppal: సొంత భవనం లేక ఉప్పల్ ఎక్సైజ్ పీఎస్ అవస్థలు
ఉప్పల్: సొంత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతున్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారుల ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. చివరకు జెండా పండుగను సైతం రోడ్డుపైనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ అద్దె భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఉప్పల్ ఎక్సైజ్ కార్యాలయానికి మాత్రం ఇప్పటికీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనం కేటాయించలేదు.
గత కొన్ని నెలలుగా మల్కాజ్గిరి నగరపాలక సంస్థ కమిషనర్, ఉప్పల్ జోనల్ కమిషనర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్లకు ప్రభుత్వ భవనం కేటాయించాలని ఎక్సైజ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని సమాచారం.
అద్దె చెల్లింపులు నిలిచిపోవడంతో ఒత్తిడి
ప్రస్తుతం కొనసాగుతున్న అద్దె భవనానికి ప్రభుత్వం నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోవడంతో భవన యజమాని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయం పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని సైతం యజమాని కర్రలతో కంచె ఏర్పాటు చేసి మూసివేసినారు. దీంతో అధికారులు, సిబ్బందికి కార్యాలయంలోకి రాకపోకలు మరింత ఇబ్బందికరంగా మారాయి.
పార్కింగ్ లేక.. రాకపోకలకు ఇబ్బందులు
మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయానికి పార్కింగ్ సౌకర్యం లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు, ట్రాఫిక్ మార్పుల కారణంగా రహదారి వన్వేగా మారడంతో అధికారిక వాహనాల రాకపోకలు కూడా కష్టంగా మారాయి. కార్యాలయానికి అవసరమైన మౌలిక వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
జెండా పండుగ రోడ్డుపైనే
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉండగా, ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు మాత్రం సొంత భవనం లేకపోవడంతో జెండా పండుగను రోడ్డుపైనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కీలకమైన ఆదాయం అందించడంతో పాటు మద్యం అక్రమ రవాణా, డ్రగ్స్ నియంత్రణ వంటి బాధ్యతలు నిర్వహించే శాఖకు కనీస మౌలిక వసతులు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారులు స్పందించాలి
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తాత్కాలికంగానైనా ప్రభుత్వ భవనం కేటాయించాలని అధికారులు, స్థానికులు కోరుతున్నారు. శాశ్వత భవనం ఏర్పాటు చేసే వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనంలోకి కార్యాలయాన్ని తరలిస్తే అధికారుల ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.




