Uppal: జిల్లాల్లో హెచ్‌సీఏ కార్యాలయాలు టీ. శేషనారాయణ

Uppal: తెలంగాణలో క్రికెట్ అభివృద్ధిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లాలో హెచ్‌సీఏ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ శేషనారాయణ వెల్లడి.

Venkata Thirumala
Published on: 12 Aug 2026 5:07 PM IST
Uppal
X

Uppal: జిల్లాల్లో హెచ్‌సీఏ కార్యాలయాలు టీ. శేషనారాయణ

ఉప్పల్‌: తెలంగాణలో క్రికెట్‌ అభివృద్ధిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కీలక నిర్ణయాలు తీసుకుంటోందని జిల్లా క్రికెట్‌ మౌలిక వసతుల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ టి. శేషనారాయణ తెలిపారు. ప్రతి జిల్లాలో హెచ్‌సీఏ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు, స్థానికంగా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

2–3 నెలల్లో జిల్లాల్లో హెచ్‌సీఏ కార్యాలయాలు

తెలంగాణలోని ప్రతి జిల్లాలో రానున్న రెండు, మూడు నెలల్లో హెచ్‌సీఏ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని శేషనారాయణ తెలిపారు. క్రీడాకారుల సమస్యలు, సెలక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను జిల్లాల నుంచే స్వీకరించేలా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల క్రీడాకారులు ప్రతి పనికీ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు.

గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

జిల్లాల్లో క్రికెట్‌ మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్కూళ్లు, కళాశాలలను సందర్శించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తిస్తామని, అందుబాటులో ఉన్న మైదానాలను క్రికెట్‌ అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జిల్లాల్లోనే క్రీడాకారుల ఎంపిక

ప్రతిభావంతులైన క్రీడాకారులను వారి సొంత జిల్లాల్లోనే గుర్తించి ఎంపిక చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నట్లు శేషనారాయణ వెల్లడించారు. జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను హెచ్‌సీఏ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ ఎ.టి. రాయుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇప్పటికే సూర్యాపేట, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట జిల్లాల్లో బీసీసీఐ ప్రమాణాలతో నాలుగు అత్యాధునిక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

టీజీ–20 ఫ్రాంచైజీల భాగస్వామ్యం

జిల్లా క్రికెట్‌ అభివృద్ధి కార్యక్రమాల్లో టీజీ–20 ఫ్రాంచైజీలను భాగస్వామ్యం చేయనున్నట్లు శేషనారాయణ తెలిపారు. ఫ్రాంచైజీల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లకు మెరుగైన శిక్షణ, అవకాశాలు కల్పించడంతో పాటు, స్థానికంగానే ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయి ఎంపికలకు తీసుకెళ్లేందుకు వీలవుతుందన్నారు. తెలంగాణలోని ఏ మూలన ప్రతిభ ఉన్నా.. ఆ క్రీడాకారుడికి అవకాశం అందాలి. క్రికెట్‌ అభివృద్ధి హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు తీసుకుంటాం అని శేషనారాయణ స్పష్టం చేశారు.

Venkata Thirumala

Venkata Thirumala